మారేడుపల్లి అడవుల్లో మళ్లీ మోగిన తుపాకుల మోత... మావో కార్యదర్శి దేవ్‌జీ హతం
ఏపీలోని శ్రీ అల్లూరి సీతారామరావు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుపల్లి అటవీ ప్రాంతంలో మరోమారు తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలకు మవోయిస్టులకు మధ్య బుధవారం మరోమారు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ముఖ్యంగా, మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్‌జీ కూడూ మృతుల్లో ఉన్నట్టు సమాచారం.
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరిలో మావోయిస్టు అగ్రనేత దేవ్ కూడా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.
ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్ చంద్ర లడ్డా విజయవాడలో ధ్రువీకరించారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, వారిని ఏరివేసేందుకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన సూచించారు.
నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మా మద్వితో పాటు మరో ఐదుగురిని మట్టుబెట్టినట్లు డీజీ వివరించారు. హిడ్మా ఎదురుకాల్పుల్లోనే మరణించారని, ఆయన్ను పట్టుకుని చంపారనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
|
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు డీజీ తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మొత్తం 50 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. వీరిలో ముగ్గురు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 23 మంది ప్లాటూన్ సభ్యులు ఉన్నారు.
అరెస్టయిన వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్ లో దాడులు పెరగడంతో మావోయిస్టులు ఏపీలోకి ప్రవేశిస్తున్నారని, ఈ క్రమంలోనే పట్టుబడుతున్నారని ఆయన తెలిపారు.