బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (08:57 IST)

ఏపీ అసెంబ్లీ సెషన్స్.. 11న 11 గంటలకు 11 రోజులు స్టార్ట్ - ఆ 11 మంది ఎమ్మెల్యేలు సభకు వస్తారా?

ap assembly
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. 11వ తేదీన 11 గంటలకు ఈ సమావేశాలు మొదలవుతాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. అయితే, ఈ సమావేశాలకు 11 మంది ఎమ్మెల్యేలు కలిగిన వైకాపా సభ్యులు హాజరవుతారా లేదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
కాగా, సమావేశాలు ప్రారంభరోజున రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అదే రోజున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయి ఆర్థిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా, పలు చట్ట సవరణ బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. 
 
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాత్కాలిక ప్రాతిపదికన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఈ బడ్జెట్‌ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుండగా, తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. 
 
ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పతకం గెలిస్తే రూ.7 కోట్లు ఇస్తాం : సీఎం చంద్రబాబు 
 
ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పతకం గెలిచే క్రీడాకారుడికి రూ.7 కోట్ల నగదు బహుమతి ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సోమవారం రాష్ట్ర కొత్త క్రీడా విధానంపై ఆయన సమీక్ష చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్రీడా పోటీల్లో పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల అందరికీ ఆసక్తి పెరుగుతుందన్నారు. ఒలింపిక్స్ బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటివరకు రూ.75 లక్షలు ఇస్తుండగా, ఈ మొత్తాన్ని ఇకపై రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
అలాగే, రజత పతకం సాధించిన వారికి రూ.5 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.30 లక్షల స్థానంలో రూ.3 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. వరల్డ్ చాంపియన్ షిప్, వరల్డ్ కప్పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధిస్తే రూ.10 లక్షలు, రజతం విజేతలకు రూ.5 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.3 లక్షలు చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి అందజేస్తామన్నారు.