మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)
దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన భారత జవాను మురళీ నాయక్ భౌతికకాయానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్, అనిత, సవిత, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు తదితరులు ఆదివారం నివాళులు అర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి జవాను భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.
అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి ఐదు ఎకరాలతో పాటు 300 గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే, తన వ్యక్తిగతంగా వీర జవాను కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మురళీ నాయక్ కటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు మురళీ నాయక్ అంత్యక్రియలను ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు.