మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మే 2024 (10:30 IST)

ఈ ఐదేళ్లలో ఒకటో తారీఖున జీతాలు పడిన దాఖలాలు లేవు : సూర్య నారాయణ

surya narayana
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకటో తారీఖున ఒక్కటంటే ఒక్కసారి కూడా వేతనాలు పడిన దాఖలాలు లేవని  ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్‌ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ, పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని.. ఈ ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం, పెన్షన్‌ అందలేదని ఆయన ఆరోపించారు. 
 
'ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల కోసం నిరసనలు, ఆందోళనలు చేస్తే ప్రభుత్వం నిరంకుశంగా అణచివేసింది. సమస్యలపై ప్రతిపక్ష నేతలను కలవడాన్ని సైతం నేరంగా పరిగణించింది. ఆర్థిక చెల్లింపులపై ఉన్న మార్గదర్శకాలను చట్టంగా మార్చాలని.. దాని ప్రకారం గడువు లోపు చెల్లించకపోతే ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్‌ చేసే అవకాశం ఉంటుందని గవర్నర్‌ను కలిసి విన్నవిస్తే, సర్కారు మాపై కక్షసాధింపులకు పాల్పడింది. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎఫ్‌ నిధులను దొంగతనంగా తీసేసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీన్ని నేరంగా పరిగణించి బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్‌ చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అమ్ముకోవడంపై చర్యలు తీసుకుంటామని సీఈవో చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.