శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2024 (12:33 IST)

తితిదేకు వెయ్యి ఆవులు ఇస్తాం.. సొంతంగా డెయిరీ పెట్టుకోండి : రామచంద్ర యాదవ్

cow2
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కి సొంతంగా పాల డెయిరీ ఎందుకు ఉండరాదని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. తమ పార్టీ తరపున వెయ్యి ఆవులు ఇస్తామని అందువల్ల తితిదే సొంతంగా డెయిరీ పెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. 
 
తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం కొనసాగుతున్న వేళ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ లేఖ రాయడం గమనార్హం. అలాగే, తితిదేకు వెయ్యి ఆవులు ఇస్తామని కీలక ప్రకటన చేయడం గమనార్హం. టీటీడీకి తాను వెయ్యి గోవుల్ని ఇస్తానని, వాటితో డెయిరీఫాం పెట్టి నెయ్యి తయారుచేసి ఆ నెయ్యినే లడ్డూ ప్రసాదాలకు ఉపయోగించవచ్చంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు. 
 
తితిదేకి సొంత డెయిరీ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వం కనుక డెయిరీ ఏర్పాటుకు రెడీగా ఉంటే తాను వెయ్యి ఆవుల్ని ఇస్తానని పేర్కొన్నారు. అంతేకాదు, మరో లక్ష గోవుల్ని ఉచితంగా తిరుమలకు తరలించే బాధ్యతను కూడా తాను తీసుకుంటానని చెప్పారు. లక్ష ఆవుల నుంచి రోజుకు పది లక్ష లీటర్ల పాలు ఉత్పత్తి అయినా దాదాపు 50 వేల కేజీల వెన్న వస్తుందని, దాని నుంచి సుమారు 30 వేల కేజీల నెయ్యి ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. 
 
ఆ నెయ్యిని స్వామివారి ధూప, దీప నైవేద్యాలు, లడ్డూ తయారీ కోసం ఉపయోగించవచ్చని, మిగతా నెయ్యిని ఇతర ఆలయాలకు కూడా సరఫరా చేయవచ్చని తెలిపారు. ఇలా చేస్తే నెయ్యి కల్తీ జరగకుండా ఉంటుందని అభిప్రాయడ్డారు. అలాగే, టీటీడీ పాలకమండలిలో ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులకు చోటు కల్పించాలని ఆయన కోరారు.