శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2024 (09:10 IST)

ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేలా ప్రణాళిక : సీఎం చంద్రబాబు ఆదేశం

chandrababu naidu
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి రాష్ట్రాన్ని 100 శాతం కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు అనుగుణంగా భారీ ప్రణాళికలను అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఒకవైపు పోలవరం పూర్తి చేయడం ద్వారా 8 ఉమ్మడి జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు. 
 
పోలవరంతో ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కూడా లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు తెలిపారు. గోదావరి నదిలో వరదల సమయంలో సరాసరి ఏటా 2 నుంచి 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, ఈ నీటి నుంచి 280 టీఎంసీలను వరదల సమయంలో తీసుకోవడం ద్వారా... కృష్ణా డెల్టాకు, రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లబ్ది చేకూర్చేందుకు కార్యచరణ తీసుకువస్తున్నట్టు వివరించారు.
 
రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బనకచర్లకు తరలించడమే మార్గమని ఆయన తెలిపారు. అటు పోలవరం, ఇటు ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విస్తృత స్థాయిలో రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు, పరిశ్రమలకు మేలు జరగబోతోంది. 
 
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందుతుంది. దీనితో పాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పరిశ్రమలకు దాదాపు 20 టీఎంసీల నీటిని వినియోగించవచ్చు. దీని కోసం రెండు మూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 
 
గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తారు. కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కు తరలిస్తారు. 200 టిఎంసిల సమర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మిస్తారు. అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కు నీటికి తరలిస్తారు. బొల్లాపల్లి నుంచి బనకచర్లకు 31 కి.మీ టన్నెల్ ద్వారా నీటిని తరలిస్తారు.
 
బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, ఎస్ఆర్‌బీసీ, నిప్పుల వాగుకు నీళ్ళు వెళుతుంటాయి. నిప్పుల వాగు ద్వారా సోమశిల, కండలేరుకు నీటిని తరలిస్తారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని వివిధ లిఫ్టులు, కాలువల ద్వారా అన్ని ప్రాజెక్టులకు తరలిస్తారు.