శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (11:41 IST)

డిప్యూటీ సీఎం పవన్ దూకుడు: మైనింగ్, సోషల్ మీడియా సైకోల వెన్నులో వణుకు

pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పరిధిలోని శాఖలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగిందో పూర్తి నివేదికలు తనకు ఇవ్వాలని ఆయన ఆదేశాలిచ్చారు. మరోవైపు సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్న ఉన్మాదులను ఒక్కొక్కరిని వెంటాడి పట్టుకుని పీచమణుస్తున్నారు. ఇక అటవీశాఖ విషయానికి వస్తే... ఐ.ఎస్.జగన్నాథపురంలో అనుమతి లేని ప్రదేశంలో తవ్వకాలు జరిగినట్లు అధికారుల తనిఖీల్లో బైటపడింది. అనుమతులకు విరుద్ధంగా 20.95 ఎకరాల్లో 6 లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా రెడ్ గ్రావెల్ తవ్వకం జరిగినట్లు కనుగొన్నారు.
 
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. రెవెన్యూ, గనుల శాఖల విచారణలో అక్రమాలు వెలుగుచూసాయి.ఏలూరు జిల్లా ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలో అనుమతులకు విరుద్ధంగా సాగిన రెడ్ గ్రావెల్ తవ్వకాలపై విచారణ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 20.95 ఎకరాల్లో ఏ విధమైన అనుమతులు లేకుండా 6 లక్షల క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ తవ్వకం సాగించినట్లు గుర్తించారు. ఇటీవల దీపం 2 పథకం ప్రారంభం కోసం ఐ.ఎస్.జగన్నాథపురంలో పర్యటించిన సమయంలో, అక్కడి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కొండ సమీపంలో ఎర్ర కంకర త్రవ్విన విషయం గమనించారు. భారీగా తవ్వకాలు సాగించినట్లు చూస్తుంటేనే కనిపించే పరిస్థితి ఉండటంతో ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ తవ్వకాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
 
నివేదికలో బయటపడిన వివరాలు ఇవే..
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి విచారణ నివేదిక చేరింది. ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలోని సర్వే నెంబర్ 425 లో 6.18 ఎకరాల్లో 74,875 క్యూబిక్ మీటర్లు తవ్వుకొనేందుకు అనుమతి తీసుకొని ఎలాంటి తవ్వకాలు చేయలేదు. అదే సర్వే నెంబర్ లో మరోచోట 1.48 ఎకరాల్లో 36,107 క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకొని 33,637 క్యూబిక్ మీటర్లు తవ్వుకున్నారు. అదే సర్వే నెంబర్ లో మరో చోట ఎలాంటి అనుమతులు లేకుండా  20.95 ఎకరాల్లో ఏ విధమైన అనుమతులు లేకుండా 6,15,683  క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ తవ్వకం సాగించినట్లు తాజా విచారణలో గుర్తించారు.
 
అనుమతి ఉన్న చోట తవ్వకుండా మరో చోట తవ్వడం నిబంధనలకు విరుద్ధం. అలా తవ్విన రెడ్ గ్రావెల్ ను అనుమతి ఉన్న ప్రదేశాల నుంచి తవ్వినట్లు నమోదు చేసినట్లు గుర్తించారు. ఈ తప్పిదాలపై బెకెమ్ ఇన్ఫ్రా సంస్థకు నోటీసులు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి జిల్లా కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ఇందుకు బాధ్యులైన రెవెన్యూ, గనుల శాఖల అధికారులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు తెలియచేశారు. ఐ.ఎస్.జగన్నాథపురం తవ్వకాలు సాగించిన ప్రదేశంలో భారీగా పచ్చదనం దెబ్బ తిన్నట్లు, జీవ వైవిధ్యానికి విఘాతం వాటిల్లిన విషయం కూడా తన దృష్టికి రావడంతో, ఈ అంశంపైనా అటవీ శాఖ అధికారులను విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.