శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2025 (19:38 IST)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

chevireddy
తితిదే మాజీ చైర్మన్, వైకాపా సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టి వేయాలంటూ ఆయన కోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. 
 
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన ఓ బాలిక (14) ఇటీవల తనపై దుండగులు దాడి చేశారని తల్లిదండ్రులకు చెప్పింది. స్కూలు నుంచి తిరిగి వస్తుంటే ముసుగు ధరించిన కొంతమంది వ్యక్తులు తనను అడ్డుకుని, మత్తుమందు తాగించారని తెలిపింది. ఈ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సదరు బాలిక చదివే స్కూలుకు వెళ్లారు. బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించారు. 
 
బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో స్పందించిన పోలీసులు సదరు బాలికకు వైద్య పరీక్షలు జరిపించారు. అయితే, బాలికపై అత్యాచారం జరగలేదని వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోకుండా బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో బాలిక తండ్రి చెవిరెడ్డిపై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు చెవిరెడ్డిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.