బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జనవరి 2025 (09:21 IST)

వైకాపా మాజీ నేతలు స్వలాభం మానుకోవాలి : నాగబాబు హితవు (Video)

pawan kalyan
వైకాపాతో సహా ఇతర పార్టీల నుంచి వచ్చి జనసేన పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఓ సూచనతో కూడిన హెచ్చరిక చేశారు. జనసేన పార్టీలో చేరిన తర్వాత స్వలాభం గురించి ఆలోచన చేయడం మరిచిపోవాలని హితవు పలికారు. జనసేన పార్టీలో చేరడం అంటే అవసరంలో ఉన్న వారికి శాయశక్తులు సేవ చేయడమన్నారు. 
 
అంతేకానీ, ప్రభుత్వంలో భాగస్వాములం కాబట్టి గత వైకాపా ప్రభుత్వంలో నడుచుకున్నట్టుగా దోచుకుందాం, దాచుకుందాం అంటే కుదరదని చెప్పారు. మీరు ఏ పార్టీ నుంచి వచ్చినా ముఖ్యంగా, వైకాపా నుంచి వచ్చిన వాళ్లు గుర్తుపెట్టుకోవాల్సింది స్వలాభం అనే ఆలోచన ఉండకూడదు అని, ఏదన్నా నిజంగా అవసరం, సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం తరపున సాయం చేసేలా కృషి చేస్తామని తెలిపారు. 
 
కాగా, సోమవారం చిత్తూరు, తిరుపతి, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన అనేక మంది వైకాపా నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి జనసేన పార్టీలో చేరారు. వీరిని ఉద్దేశించి నాగబాబు పై విధంగా వ్యాఖ్యానించారు. అలాగే, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని వివిధ ప్రమాదాల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల తరపున పార్టీ తరపున ఆర్థిక సాయం చేసే చెక్కులను ఆయన పంపిణీ చేశారు.