శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (18:40 IST)

సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం... లుకౌట్ నోటీసు జారీ

sajjala bhargav reddy
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకుగాను వైకాపా సోషల్ మీడియా విభాగం ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఈయన అజ్ఞాతంలో ఉన్నారు. ఈయన ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా పేరుగడించిన వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడే ఈ సజ్జల భార్గవ్ రెడ్డి. ఈయన వైకాపా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాతే వైకాపా నేతలు విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై రాయలేని భాషలో ఉండే అసభ్యకర పోస్టులతో రెచ్చిపోయారు. ఈ కేసులో కీలకంగా ఉండే వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. దీంతో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 
 
వర్రా రవీంద్రా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా, ఈ కంటెంట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని సజ్జల భార్గవ్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, మరో కీలక నేత అర్జున్ రెడ్డిలే ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు. దీంతో సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, మరో కీలక నేత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వీరు దేశం దాటి వెళ్లకుండా లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు. కాగా, భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైవున్న విషయం తెల్సిందే.