దస్త్రాల దహనం కేసులో బిగ్ ట్విస్ట్... మదనపల్లె మాజీ ఆర్డీవో అరెస్టు
చిత్తూరు జిల్లా మదనపల్లెలోని రెవెన్యూ కార్యాలయంలో కీలకమైన భూరికార్డులను కాల్చివేసిన కేసులో మదనపల్లె మాజీ ఆర్డీవో మురళిని ఏపీ పోలీసులు అస్టు చేశారు. ఆయనకు గతంలో మంజురైన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో ఆయనను తిరుపతిలోని నివాసంలో అరెస్టు చేశారు.
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, గత యేడాది జూలై 21వ తేదీన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొన్ని కీలక దస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు అప్పటి ఆర్డీవో మురళిని నిందితుడుగా చేర్చారు. ఈ కేసులో ఆయనకు ఈ యేడాది జూనే 2వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్‌ను బుధవారం సుప్రీంకోర్టు రద్దు చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన ఏపీ సీఐడీ పోలీసులు... మాజీ ఆర్డీవో మురళిని తిరుపతిలోని నివాసంలో ఉండగా అరెస్టు చేశారు.కాగా, ఈయన 2022 అక్టోబరు నుంచి 2024 ఫిబ్రవరి 5వ తేదీ వరకు మదనపల్లె ఆర్డీవోగా బాధ్యతలు నిర్వర్తించారు. బెయిల్ రద్ద అయిన 24 గంటల్లోనే ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. అదేసమయంలో ఈ కేసులో తదుపరి విచారణను సీఐడీ అధికారులు కొనసాగించనున్నారు.