శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 జులై 2024 (10:41 IST)

బాలుడి కోసం కాన్వాయ్ ఆపిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్

Pawan kalyan
Pawan kalyan
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద కోతకు గురవుతున్న సముద్ర తీరాన్ని పరిశీలించేందుకు వెళ్తుండగా ఆయన కాన్వాయ్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఓ బాలుడు ఇంటి ముందు జనసేన జెండా ఊపుతుండగా, డిప్యూటీ సీఎం బాలుడిని గమనించి కాన్వాయ్‌ను ఆపారు. కారు దిగి బాలుడితో కాసేపు మాట్లాడారు. 
 
కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా మూడో రోజు ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ సింప్లిసిటీని పలువురు స్థానికులు కొనియాడారు. అనంతరం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కోతకు గురైన సముద్ర తీరాన్ని పరిశీలించి మత్స్యకారులతో ముచ్చటించారు. ఉప్పాడ తీరం భారీగా కోతకు గురవుతోంది. 
 
చెన్నై నుంచి వచ్చిన నిపుణుల బృందం ఉప్పాడ తీరాన్ని పరిశీలించి, రక్షణకు అవసరమైన చర్యలను సూచించనుంది. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా పథకంలోని రక్షిత మంచినీటి ట్యాంక్‌ను, సూరప్ప చెరువును పవన్ పరిశీలించారు. 
 
ఉప్పాడ కొత్తపల్లి మండలానికి రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్న ట్యాంక్ గురించి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వివరించారు. సూరప్ప చెరువు సమీపంలోని 7ఎంఎల్‌డీ ఇసుక వడపోత, పవర్‌హౌస్‌, ల్యాబ్‌లను ఆయన పరిశీలించారు. 
 
కాకినాడ ఎంపీ టీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జెడ్పీ సీఈవో శ్రీరామచంద్రమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఎంవీ సత్యనారాయణ, డీపీఓ కె.భారతి సౌజన్య, ఆర్డీఓ కిషోర్ పాల్గొన్నారు. ఉప్పాడ ప్రాంతంలో సముద్రం కోతకు గురైన ప్రాంతాలను కూడా ఉపముఖ్యమంత్రి పరిశీలించారు.