బియ్యం గోడౌన్లో గంజాయి బ్యాగ్ పెట్టేందుకు ప్రయత్నించారు, పోలీసులపై పేర్ని నాని ఆరోపణ
మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం వ్యవహారం గురించి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. బియ్యం గోడౌన్లో గంజాయి మూటను పెట్టేందుకు పోలీసు అధికారి ప్రయత్నించారంటూ ఆయన ఆరోపణ చేసారు. తమ లీగల్ టీం ఎదురుగానే ఆయన తన సిబ్బందిపై చిందులు తొక్కుతూ ఇలా వ్యాఖ్యానించారంటూ వెల్లడించారు.
పేర్ని నాని మాట్లాడుతూ... ఓ మంత్రి నా భార్యను అరెస్ట్ చేయమని సీఎం చంద్రబాబుకి సూచన చేసారు. దీనితో ఇంట్లో ఆడవాళ్లను అరెస్ట్ చేయడమేంటి అని చంద్రబాబు తిట్టారు. ఇది ఎప్పుడు జరిగిందో తారీఖు సమయం అన్ని వివరాలు నాకు తెలుసు. రేషన్ బియ్యం అవకతవకలు జరిగాయంటూ 10వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. పోలీసు దర్యాప్తు చేయాలి కదా.
3 రోజుల తర్వాత రాజకీయ ఒత్తిడి మేరకు వెళ్లి, మేం తాళాలు ఇస్తామని చెప్పినా వినకుండా తాళాలు పగులగొట్టారు. మా లీగల్ టీం వెళ్లారు. స్వామిభక్తి పారాయణుడైన సీఐ గారు చాలా కష్టపడ్డారు. ఆయనకు మాటమాటికి ఫోన్ వస్తోంది. పక్కనే వున్న పోలీసు కానిస్టేబులుతో సదరు సీఐ మాట్లాడుతూ... ఆయనేమో ఫోన్ చేసి ఎలాగోలా గంజాయి మూట పెట్టమని చెప్తున్నారు.
ఈ లీగల్ టీం లాయర్లు ఏమో ఇక్కడ నుంచి కదలటం లేదు అని స్వయంగా సీఐ అన్నారు. ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి.. నాపైన రాజకీయ కక్షతో ఇవన్నీ చేస్తున్నారు. రాష్ట్రమంతటా పేర్ని నాని ప్రతి దానికి మాట్లాడతారు. కానీ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు ఎందుకని ప్రశ్నించారు. నేను ఆనాడే మాట్లాడుదామని నిర్ణయించుకున్నా. కానీ నా భార్య బెయిల్ గురించి కోర్టులో వాదన వుందని, న్యాయవాదుల సలహా మేరకు మౌనం వహించా... అంటూ చెప్పుకొచ్చారు.