తిరుమల పరకామణి చోరీ... దర్యాప్తును వేగవంతం చేసిన సీఐడీ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి పరకామణి చోరీ కేసులో అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో అధికారుల విచారణ కొనసాగుతోంది. గతంలో తిరుమల వన్‌టౌన్ పోలీస్ స్టేషనులో పని చేసిన పోలీసులు ఎస్ఐ లక్ష్మీరెడ్డి, సీఐ జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. పరకామణి చోరీ సమయంలో తితిదే వీజీవోగా పనిచేసిన గిరిధర్ కూడా విచారణకు వచ్చారు.
తిరుమల పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి ఓ మఠం తరపున పనిచేసేవాడు. ఏళ్లతరబడి గుమస్తాగా ఉంటూ.. విదేశీ కరెన్సీని లెక్కించేవాడు. చాలాకాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించారనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. వైకాపా హయాంలో 2023 ఏప్రిల్ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ.. అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న అరల్లో దాచుకున్నాడు. అతని కదలికలపై అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేయగా పట్టుబడ్డాడు.
దీనిపై అప్పటి ఏవీఎస్వో సతీష్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ రోజు అతడు 900 డాలర్లు అపహరించగా, అప్పట్లో వాటి విలువ రూ.72 వేలుగా (డాలర్ రూ.80 చొప్పున) తేల్చారు. అసలు దొరికింది 112 నోట్లని, రికార్డుల్లో తొమ్మిది నోట్లే చూపించారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా చాలాకాలంగా పరకామణిలో చేతివాటం చూపించి కాజేసిన సొమ్ముతో రవికుమార్ రూ.కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలున్నాయి. ఇది తెలుసుకున్న వైకాపాలోని కొందరు పెద్దలు లోక్‌అదాలత్‌లో కేసును రాజీ చేయించి, అతడి ఆస్తులను కొట్టేసినట్లు చెబుతున్నారు.