3460 సార్లు శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తాగ్రేసరుడు....
కలియుగ వైకుంఠదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని సాధారణంగా జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకుంటేనే జన్మధన్యమైపోతుందని అనేక మంది భావిస్తుంటారు. అయితే, తిరుపతికి చెందిన ఓ భక్తుడు ఇప్పటివరకు ఏకంగా 3460 సార్లు శ్రీవారిని దర్శించుకుని తరించిపోయాడు. అతని వయసు 71 యేళ్ళు. అందులే 3250 సార్లు కాలినడకనే తిరుమలకు వెళ్ళి ఆ దేవదేవుడుని దర్శనం చేసుకోవడం విశేషం.
తిరుపతికి చెందిన వెంకట రమణమూర్తి ఎస్‌బీఐలో మేనేజర్‌గా చేసి 2014లో రిటైరయ్యారు. తర్వాత శేష జీవితాన్ని స్వామి సేవకు దొరికిన అవకాశంగా భావించిన ఆయన.. వరుసగా కాలినడకన తిరుమల వెళుతూ దర్శనాలు చేసుకుంటున్నారు. 'ఉద్యోగంలో ఉన్నప్పుడూ తిరుమల వెళ్లేవాడిని. పదవీ విరమణ తర్వాత మాత్రం ఎక్కువగా వెళుతున్నా. వారంలో కనీసం నాలుగు రోజులు శ్రీవారిని దర్శించుకుంటాను' అని రమణమూర్తి వివరించారు.
ఎక్కువగా శ్రీవారి మెట్ల మార్గంలోనే వెళతానని, గోవిందనామాన్ని జపిస్తూ, నిలకడగా నడిస్తే 2,388 మెట్లను గంటన్నరలోనే ఎక్కి కొండపైకి చేరుకుంటానని చెబుతున్నారు. ఈ వయసులో ఇంతటి శక్తి ఎలా వస్తోందని అడిగితే 'అదంతా వేంకటేశ్వరస్వామి దయే.. ఆరోగ్యం కాపాడుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంది' అని వినమ్రంగా చెప్పారాయన.