శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 జులై 2024 (14:41 IST)

టీటీడీలో కొనసాగుతున్న ప్రక్షాళన ... 208 మంది దళారుల అరెస్టు!!

tirumala
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ప్రక్షాళన కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అవినీతి అక్రమాలను అరికట్టేందుకు నడుం బిగించింది. ఇందుకోసం తిరుమల కొండపై ప్రక్షాళన చేపట్టింది. టీటీడీలో విజలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. టీటీడీకి చెందిన వివిధ విభాగాల్లో 40 మంది అధికారులతో ఈ సోదాలు చేపట్టారు. గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన పరిణామాలు, కార్యకలాపాలు, లావాదేవీలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు.
 
విచారణలో భాగంగా విజిలెన్స్ అధికారులు తిరుపతిలో స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరించారు. బీజేపీ నేత నవీన్ పలు వివరాలను, తన వద్ద ఉన్న ఆధారాలను విజిలెన్స్ అధికారులకు అందించారు. తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన టీడీపీ ప్రభుత్వం దళారులను ఏరిపారేస్తోంది. గత ప్రభుత్వం హయాంలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలకు సిద్ధమవుతోంది. టీటీడీ గదుల విషయంలో అక్రమాలకు పాల్పడిన దళారుల భరతం పట్టేందుకు సిద్ధమైంది.
 
2019 నుంచి ఇప్పటి వరకు దళారుల అక్రమాలపై 279 కేసులు నమోదయ్యాయి. అలాగే, నకిలీ ఆధార్తో గదులు, సేవా టికెట్లు పొందిన 589 మందిని గుర్తించి వీరిలో 208 మందిని అరెస్ట్ చేశారు. మిగతా 381 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. గదుల బుకింగ్ సమయంలో నిందితులు సమర్పించిన నకిలీ ఆధార్ కార్డుల ఆధారంగా వారిని పట్టుకునే పనిలో పడ్డారు.