ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీకి వచ్చి బాత్రూమ్‌లో ప్రసవం.. బిడ్డను బక్కెట్‌లో వదిలి...
ఓ మహిళ ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీ కోసం వచ్చి బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత బిడ్డను బాత్రూమ్ బక్కెట్‌లో వదిలిపెట్టి పోయింది. కొంత సేపటికి ఆ పసికందు ఏడుపు శబ్దాలు విని ఆస్పత్రి సిబ్బంది గుర్తించి, బిడ్డను రక్షించారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెలుగు చూసింది.
ఓ గర్భిణీ మహిళ ప్రసవం కోసం నడుచుకుంటూ ఆస్పత్రిగా ఆస్పత్రికి వస్తున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపిస్తున్నాయి. అయితే, ఆ మహిళ వైద్యులను సంప్రదించకుండా ఆస్పత్రి బాత్రూమ్‌కు వెళ్లి, అక్కడే ఓ శిశువును ప్రసవించింది. ఆ బిడ్డను బాత్రూమ్ బక్కెట్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయింది. శిశువు ఏడుపు శబ్దం విన్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించారు.
అయితే, ఆ సమయంలో ఆ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆ శిశువును మరో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా ఆ మహిళ మరో వ్యక్తితో కలిసి ఆస్పత్రికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.