శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 24 అక్టోబరు 2024 (12:57 IST)

వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు, జగన్‌ వేసిన పిటిషన్‌లో ఏముంది? షర్మిలకు జగన్‌ రూ.200 కోట్లు ఇచ్చారా?

sharmila - jagan
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కుటుంబంలో విభేదాల గురించి మరొకసారి చర్చ మొదలైంది. తాజాగా ఒక కంపెనీలోని వాటాల గురించి వైఎస్‌ జగన్, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్‌ వేయడమే ఇందుకు కారణం. ఆ పిటిషన్‌లో వైఎస్‌ జగన్, ఆయన సోదరి వైఎస్‌ షర్మిలకు మధ్య విభేదాల గురించి కూడా ప్రస్తావించారు.
 
అక్రమంగా బదిలీ చేశారంటున్న వైఎస్ జగన్
సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీలో వాటాల బదిలీకి సంబంధించి ఎన్‌సీఎల్‌టీలో వైఎస్‌ జగన్, ఆయన భార్య వైఎస్‌ భారతి పిటిషన్‌ వేశారు. ఇందులో వైఎస్‌ జగన్‌ పిటిషనర్‌–1గా, ఆయన భార్య వైఎస్‌ భారతి పిటిషనర్‌–2గా ఉన్నారు. క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పిటిషనర్‌–3గా ఉంది. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌లో వైఎస్‌ జగన్‌కు, ఆయన భార్యకు చెందిన వాటాలను ‘‘అక్రమంగా’’ తన తల్లి వైఎస్‌ విజయమ్మ పేరు మీదకు బదిలీ చేశారని, ఆ షేర్ల బదిలీని రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.
 
ఎన్‌సీఎల్‌టీలో వేసిన పిటిషన్‌ ప్రకారం...
జగన్ వేసిన పిటిషన్‌లో ఏముందో వైజాగ్‌కు చెందిన న్యాయవాది శ్రీ లక్ష్మీ వివరించారు. ‘‘వైఎస్‌ జగన్, ఆయన భార్య భారతీలకు చెందిన ఆస్తులు, షేర్లలో కొన్నింటిని వైఎస్‌ షర్మిలకు ఇవ్వాలని నిర్ణయించారు. అది ప్రేమ, అభిమానంతో తన చెల్లికి వాటాలు ఇస్తున్నట్లుగా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌లో షేర్ల బదిలీకి సంబంధించి 2019 ఆగస్టు 31న ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం విజయమ్మను ట్రస్టీగా ఉంచి ఆ ట్రస్ట్‌ ద్వారా షర్మిలకు కంపెనీ షేర్లు భవిష్యత్తులో బదిలీ చేస్తారు. అది కూడా వైఎస్‌ జగన్, ఆయన భార్య భారతి సమ్మతి మేరకు ఆ నిర్ణయం తీసుకుంటారు.
 
అందులో భాగంగా వైఎస్‌ జగన్, ఆయన భార్య భారతి కొన్ని ఈక్విటీ షేర్లను వైఎస్‌ విజయమ్మకు బహుమతిగా ఇచ్చారు. భవిష్యత్తులో కోర్టు అనుమతులు లభించాక జగన్, ఆయన భార్య అంగీకారం మేరకు ఆ షేర్లను బదిలీ చేయాలనే ఉద్దేశంతో ఆ షేర్లను బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంటే ఆ గిఫ్ట్‌ డీడ్‌ను జగన్, భారతీల అనుమతి లేకుండా ఎగ్జిక్యూట్‌ చేయడానికి లేదు. ‘కానీ, మా అనుమతి లేకుండానే ఆ గిఫ్ట్‌ డీడ్‌ను ఎగ్జిక్యూట్‌ చేశారు’ అని పిటిషన్‌లో వైఎస్‌ జగన్, ఆయన భార్య పేర్కొన్నారు. షేర్లను బదిలీ చేసినట్లుగా చూపే ధ్రువపత్రాలు కూడా లేవు అని తెలిపారు’’ అని న్యాయవాది శ్రీ లక్ష్మీ వెల్లడించారు. అయితే, వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ షేర్లను విత్‌ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని, కానీ ఆ షేర్లను 'అక్రమంగా' బదిలీ చేయించుకున్నారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.
 
‘షర్మిల ప్రోద్బలంతోనే విజయమ్మ అలా...’
‘‘2019 నాటి ఎంవోయూ(MOU) ప్రకారం వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతీల పేరిట ఉన్న షేర్లను వైఎస్‌ విజయమ్మ వారికి తెలియకుండానే ఆమె తన పేరు మీదికి ఈ ఏడాది జులై 6న మళ్లించుకున్నారు. ఈ విషయం జులై 19న బోర్డు మీటింగ్‌లో బహిర్గతమైంది. షర్మిల ప్రోద్బలంతోనే విజయమ్మ అలా మళ్లించుకున్నారనీ, షర్మిల ముందస్తు ఆలోచనతోనే ఉద్దేశపూర్వకంగానే అలా వ్యవహరించారని జగన్‌ దంపతులు భావించారు. వెంటనే షర్మిలతో చర్చించేందుకు జులై 3, 4 వారాల్లో యత్నించగా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు ట్రైబ్యునల్‌కి వెళ్లాల్సి వచ్చింది’’ అని పిటిషన్‌ కాపీలో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నట్టు వైజాగ్‌కు చెందిన న్యాయవాది శ్రీ లక్ష్మీ వెల్లడించారు.
 
సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ పురోగతి సాధించడానికి తాము కీలక పాత్ర వహించామని జగన్, భారతి తమ పిటిషన్‌లో పొందుపరిచారు. ఈ కంపెనీలో ఎలాంటి భాగస్వామ్యం లేకపోయినప్పటికీ ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో వారికి వాటాలు ఇవ్వడానికి అప్పట్లో అంగీకరించామని పేర్కొన్నారు. వైఎస్‌ షర్మిల అనుబంధం మరిచిపోయి వ్యక్తిగత దూషణలకు కూడా దిగారని, ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ వాటాలను తిరిగి తీసుకోవాలని భావిస్తున్నామని వైఎస్‌ జగన్, పిటిషన్‌లో పేర్కొన్నారు.
 
ప్రతివాదులెవరు?
ఈ పిటిషన్‌లో సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వైఎస్‌ షర్మిల, వైఎస్‌ విజయమ్మ, జనార్ధన్ రెడ్డి చాగరి, కేతిరెడ్డి యశ్వంత్‌ రెడ్డి, రీజనల్‌ డైరెక్టర్‌ – సౌత్‌ ఈస్ట్‌ రీజియన్, తెలంగాణ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లను ప్రతివాదులుగా చేర్చారు. కంపెనీల యాక్ట్‌ క్లాజ్‌ 59 కింద వైఎస్‌ జగన్‌ తరఫున వై.సూర్యనారాయణ గత నెల 9న పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని ఎన్‌సీఎల్‌టీ విచారణకు స్వీకరించి, తదుపరి విచారణను నవంబర్‌ 8కి వాయిదా వేసింది. ‘కంపెనీ యాక్ట్‌ క్లాజ్‌ 59 ప్రకారం – ఒక కంపెనీ రిజిస్టర్‌లో ఒకరి పేరును నమోదు చేయాలన్నా లేదా తొలగించాలన్నా.. దాన్ని సరిదిద్దాలని కోరుతూ ఫిర్యాదుదారు అప్పీల్‌ చేసుకోవచ్చు. ఈ క్లాజ్‌ కిందే వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతి పిటిషన్‌ వేశారు.
 
ఈ ఏడాది సెప్టెంబర్‌ 3న ఫైల్‌ చేసిన కేసు నెంబర్‌ సీపీ– 48/2024 కాగా, సెప్టెంబర్‌ 11న కంపెనీస్‌ యాక్ట్‌–268/2024, కంపెనీస్‌ యాక్ట్‌–266/2024, కంపెనీస్‌ యాక్ట్‌–267/2024 కేసు నెంబర్లతో పిటిషన్లు దాఖలయ్యాయి. తర్వాత అక్టోబర్‌ 18న కంపెనీస్‌ యాక్ట్‌–319/2024 కేసు నెంబర్‌తో పిటిషన్‌ దాఖలైంది. సెప్టెంబర్‌ 3న దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి రెస్పాండెంట్లకు రాజీవ్‌ భరద్వాజ్, సంజయ్‌ పురి కోరం నోటీసులను జారీ చేస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 8కి వాయిదా వేసింది.
 
‘‘అన్నా చెల్లెళ్ల మధ్య ఇప్పుడు ఆ ప్రేమ లేదు’’
పిటిషన్‌లో ‘‘వైఎస్‌ జగన్‌ (పిటిషనర్‌–1)కు వైఎస్‌ షర్మిల (రెస్పాండెంట్‌–2)కు మధ్య అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమ బంధం లేదు’’ అని పేర్కొనడం చర్చనీయాంశమైంది. ‘‘వైఎస్‌ జగన్‌ పట్ల కృతజ్ఞత లేకపోవడం, ఆయన మంచిని పట్టించుకోకుండా వైఎస్‌ షర్మిల వ్యవహరిస్తున్నారు. బహిరంగంగా వైఎస్‌ జగన్‌ మీద అనేక తప్పుడు ఆరోపణలు చేశారు. వైఎస్‌ షర్మిల తీరు రాజకీయంగా వైఎస్‌ జగన్‌ను వ్యతిరేకించడమే కాకుండా ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఉంది. అందువల్ల అన్నాచెల్లెళ్ల మధ్య ఉండాల్సిన ప్రేమ, అభిమానం కరిగిపోయాయి’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
 
కొంత కాలం కిందట వైఎస్‌ జగన్‌కు, ఆయన సోదరి వైఎస్‌ షర్మిలకు ఆస్తుల పంపకం విషయంలో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ పిటిషన్‌లోని అంశాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పుడు తన సోదరికి, తనకు మధ్య ప్రేమ లేదు కాబట్టి, గతంలో తాను ఇవ్వాలనుకున్న ఆస్తులు లేదా షేర్లను ఇప్పుడు ఇవ్వాలని అనుకోవడం లేదని పిటిషనల్‌లో జగన్‌ ఎన్‌సీఎల్‌టీకి తెలిపారు. రెండేళ్ల కిందట ‘‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’’లో టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ‘‘నా ఆస్తి ఎక్కడకి పోద్ది అన్నా.. నాకుండేది నాకుంటుంది. నాకొచ్చేది నాకొస్తుంది’’ అని వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు.
 
అప్పటికి ఆమె తెలంగాణలో తాను స్థాపించిన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా వైఎస్‌ జగన్‌ స్పందించలేదు. ఆ తరువాత 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత వైఎస్‌ జగన్‌ మీద విమర్శలు ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌ తరఫున వైఎస్సార్‌సీపీ నేతలు ఘాటుగానే ఆమె మీద ప్రతి విమర్శలు చేశారు. దాంతో వైఎస్‌ జగన్, షర్మిల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. అయితే ఈ విషయమై వైఎస్‌ షర్మిలతో పాటు వైఎస్‌ జగన్‌ను సంప్రదించేందుకు బీబీసీ పలుమార్లు ప్రయత్నించింది. కానీ వారు అందుబాటులోకి రాలేదు.
 
బలమైన సంకేతం పంపేందుకే
షర్మిలతో విభేదాలు ఇకపైనా కొనసాగుతాయనే బలమైన సంకేతం ఇవ్వడానికే జగన్‌ ఈ పిటిషన్‌ వేశారని రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు అభిప్రాయపడ్డారు. ‘‘వైఎస్‌ జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపంకంపై చర్చలు జరిపిపట్లు ఇటీవల కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. దానిని తీవ్రస్థాయిలో ఖండిస్తూ.. ఇకపై కూడా విభేదాలు కొనసాగుతాయని, ఆస్తుల్లో వాటాలు ఇచ్చేది లేదని, అవసరమైతే ఇచ్చినవి కూడా వెనక్కి తీసుకుంటానని బలమైన సంకేతం పంపేందుకే వైఎస్‌ జగన్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారని భావించొచ్చు’’ అని కృష్ణాంజనేయులు అన్నారు.
 
ఆ లేఖ షర్మిలే రాశారా.. విజయమ్మ సంతకం నిజమేనా?
సోషల్‌ మీడియాలో బుధవారం రాత్రి నుంచి వైఎస్ జగన్‌కు షర్మిల రాసిన లేఖ ఇదేనంటూ కొన్ని కాపీలు వైరల్ అవుతున్నాయి. అందులో ఏముందంటే... పది అంశాలతో వివరంగా సెప్టెంబర్‌ 12న రాసినట్టు ఉన్న ఆ లేఖపై వైఎస్‌ విజయ రాజశేఖర్‌రెడ్డి (విజయమ్మ) కూడా సంతకం చేసినట్టుగా ఉంది. మనుమడు, మనుమరాళ్లకు ఆస్తులు సమానంగా పంచాలన్న తమ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను తన సోదరుడు వైఎస్‌ జగన్‌ పాటించకుండా నైతికంగా పతనమయ్యారని షర్మిల ఆ లేఖలో విమర్శించినట్లు ఉంది.
 
తండ్రి అభీష్టం మేరకు ఆస్తులను సమానంగా పంచకపోతే.. న్యాయపరమైన చర్యలు తప్పవని ఆ లేఖలో రాశారు. భారతి సిమెంట్స్, సాక్షిలో కూడా మనుమడు, మనుమరాళ్లకు సమాన వాటా ఇవ్వాలని వైఎస్‌ అప్పట్లో స్పష్టం చేసినా మెజారిటీ షేర్లన్నీ జగన్‌ ఒత్తిడి చేసి తన వద్దనే ఉంచుకున్నారని షర్మిల ప్రస్తావించారు. ’’2019లో కుదిరిన ఎంవోయూలో పేర్కొన్నట్లుగా కొద్దిపాటి ఆస్తులే రాసిచ్చినా., అన్నవు కాబట్టి అంగీకరించాం.. కానీ ఇప్పుడు మీ సొంత తల్లిపైన కేసులు వేసి.. మీ చెల్లెలు, ఆమె పిల్లలకు చట్టబద్ధంగా రావలసిన ఆస్తులను రాకుండా చేయాలని చూస్తున్నారు. నాన్న ఆకాంక్షలు, మీరిచ్చిన హామీకి విరుద్ధంగా సదరు ఎంవోయూను ఏకపక్షంగా రద్దుచేయాలని కోరుతున్నారు.
 
చివరికి ఆయనెంతో ప్రేమించే భార్య, మన అమ్మపై కేసులు పెట్టడం నాన్న ఎన్నడూ ఊహించి ఉండరు’ అని షర్మిల ఆ లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయ ప్రస్థానంపై ’’ ‘నా రాజకీయ కెరీర్‌ నా ఇష్టం. నా ప్రవర్తనను ఎవరూ నిర్దేశించలేరు’’ అని స్పష్టం చేశారు. ఇక చివరగా, నైతికంగా పతనమైన నువ్వు.. ఇప్పటికైనా నాన్న ఆకాంక్షలను నెరవేరుస్తావని, ఎంవోయూకు కట్టుబడి ఉంటావని ఆశిస్తున్నాను. లేదంటే చట్టబద్ధమైన పరిష్కారాలు అన్వేషించే హక్కులు నాకు పూర్తిగా ఉన్నాయి. ఈ వాస్తవాలను ధ్రువీకరించేందుకు గత, వర్తమాన సంఘటనలకు సాక్షిగా ఉన్న మన అమ్మ కూడా దీనిపై సంతకం చేశారు’ అని షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, ఈ లేఖ వైఎస్ షర్మిల అధికారికంగా వైఎస్ ‌జగన్‌కు ఈ లేఖ రాశారా? లేదా? అన్నది బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
 
ఆగస్టులో షర్మిలకు రాసిన లేఖలో జగన్‌ ఏమన్నారంటే..
కాగా, వైఎస్‌ జగన్‌ ముందుగా షర్మిలకు ఆగస్టు 27న లేఖ రాసినట్టు ఎన్‌సిఎల్‌టీలో దాఖలు చేసిన పిటిషన్‌లో బయటపడింది. ఆ పిటిషన్‌కు అనుబంధంగా గతంలో తాను షర్మిలకు రాసిన లేఖను జగన్‌ జతపరిచారు. ఆ లేఖలో.. ’’ఎంతో ప్రేమతో నీకు కొన్ని ఆస్తుల్ని నీ పేరిట బదిలీ చేశాను. న్యాయమైన చిక్కులు తొలగిన తర్వాత మరికొన్ని ఆస్తులు బదలాయించేలా రాసిచ్చాను. పదేళ్ల కాలంలో అమ్మ ద్వారా కానీ, నేరుగా కానీ 200 కోట్ల రూపాయలు ఇచ్చాను. కానీ నీవు కనీస కృతజ్ఞత లేకుండా నాకు వ్యతిరేకంగా వ్యవహరించావు. దాంతో నీ మీద నేను అభిమానం చూపాల్సిన అవసరం లేదు. నీ ఆలోచనలో మార్పు వస్తే నేనూ అభిమానం చూపిస్తాను. భవిష్యత్‌లో అలా అవుతుందని ఆశిస్తాను’’ అని జగన్‌ పేర్కొన్నారు.