శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 7 నవంబరు 2024 (13:10 IST)

ఉషా చిలుకూరి - జేడీ వాన్స్: అమెరికాకు కాబోయే వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రా అల్లుడు ఎలా అయ్యారు?

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మార్కొండపాడు గ్రామం. చుట్టూ పచ్చటి పొలాలు, వ్యవసాయం ఆధారంగా విలసిల్లే ఈ పల్లె ప్రజలు ఇప్పుడు పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీబీసీ పలకరించినప్పుడు భావోద్వేగానికి గురయ్యారు. అమెరికా ఉపాధ్యక్షుడు కానున్న జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి తమ వంశీకురాలు కావడంతో పాటు.. ఉష తాతముత్తాతలు ఇక్కడే పుట్టి పెరిగిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుని అక్కడి కొన్ని కుటుంబాలు సంబరపడుతున్నాయి.
 
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత మూలాలున్న కమలా హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాగా, ఇప్పుడు ఏకంగా తెలుగు మూలాలు ఉన్న ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ కావడం లాంఛనప్రాయమైంది. దీంతో ఉషా చిలుకూరి పేరు ఆంధ్రప్రదేశ్‌లో మార్మోగుతోంది. విద్యావంతుల కుటుంబం నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడి.. ఇప్పుడు దేశం గర్వించే స్థాయిలో పేరుపొందిన ఉష తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి మూలాలు ఆంధ్రాలోనే ఉన్నాయి. ఆమె పూర్వీకులు కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం నుంచి అప్పటి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ(ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది) పరిధిలోని చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి తరాల కిందటే వచ్చేసి, ఇక్కడే స్థిరపడ్డారు. ఇప్పుడు ఉష భర్త అమెరికా ఉపాధ్యక్షుడు కానుండడంతో ఈ గ్రామంలోని చిలుకూరి వంశీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
మాకు గర్వకారణం
మా చిలుకూరి ఇంటి ఆడబిడ్డ అమెరికా వైస్ ప్రెసిడెంట్ భార్య కావడం మాకు గర్వకారణంగా ఉందని ఉష తాత తరఫు బంధువు, మార్కొండపాడు గ్రామానికి చెందిన చిలుకూరి శకుంతల బీబీసీ వద్ద ఆనందం వ్యక్తం చేశారు. ఆమె భర్త శ్రీపతి శాస్త్రి బీబీసీతో మాట్లాడుతూ ఉష కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "ఉషా తాతయ్య రామశాస్త్రి ఇప్పుడు నేను ఉంటున్న ఇంట్లోనే పుట్టారు. అప్పట్లో ఇది పెద్ద మండువా ఇల్లు. రామశాస్త్రి తండ్రి వీరావధానులదీ ఇదే గ్రామం. రామశాస్త్రి ఇక్కడే విద్యాభ్యాసం మొదలుపెట్టి రాజమండ్రి కాలేజీలో చదువుకుని, ఆ తర్వాత మద్రాస్(ఇప్పుడు చెన్నై) వెళ్లి స్థిరపడ్డారు. మద్రాసులోనే పుట్టిన ఉషా తండ్రి రాధాకృష్ణ ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయారు'' అని శ్రీపతి శాస్త్రి చెప్పారు.
 
రాధాకృష్ణ తండ్రి రామశాస్త్రి.. ఆయన తల్లిదండ్రులు వీరావధానులు, సూరమ్మ, ఆయన సోదరులతో తన అనుబంధాన్ని శ్రీపతి శాస్త్రి గుర్తుచేసుకున్నారు. రాధాకృష్ణ తండ్రి తరం వరకు ఈ ఇంటికి వచ్చి ఇక్కడే ఉండేవారని, ఆ తర్వాత రాకపోకలు తగ్గాయని ఆయన చెప్పారు. ''ఇప్పుడు రాధాకృష్ణ కుమార్తె ఉష భర్త అమెరికా వైస్ ప్రెసిడెంట్ కావడం నిజంగా మాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. మా ఇంటి పేరే కాదు, మా ఊరి పేరు కూడా ఇప్పుడు ప్రాచుర్యంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది" అని శ్రీపతి శాస్త్రి బీబీసీతో చెప్పారు.
 
జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన చిలుకూరి సూర్యనారాయణ బీబీసీతో మాట్లాడుతూ.. ఇప్పుడు ఆ కుటుంబంతో మాకు బాంధవ్యాలు లేకపోవచ్చు. కానీ, మా ఇంటి పేరున్న ఆడబిడ్డ భర్త అమెరికా ఉపాధ్యక్షుడు కావడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. టాక్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న మార్కొండపాడుకే చెందిన చిలుకూరి వెంకట రామకృష్ణ శాస్త్రి బీబీసీతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. మా ఊరి పేరును ప్రపంచానికి పరిచయం చేసిన ఉషకు సెల్యూట్ అని ఆయన అన్నారు. అదే ఊరిలో శివాలయం ఎదురుగా నివసిస్తున్న చిలుకూరి నాగమణి బీబీసీతో మాట్లాడుతూ చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. ఇక చిలుకూరి వంశీకులతో పాటు ఆ గ్రామ ప్రజలు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిలుకూరి ఉషతో ఇక్కడి పురోహితులకు సంబంధబాంధవ్యాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉందని ఆ ఊరి స్థానికులైన జమీందార్ రామచంద్రరావు, మద్దుల సూర్యారావు, గంగిశెట్టి హరిబాబు బీబీసీతో అన్నారు.
 
తణుకు సమీపంలోని వడ్లూరులోనూ సంబరాలు
చిలుకూరి ఉష భర్త అమెరికా ఉపాధ్యక్షుడు కానున్న నేపథ్యంలో తణుకు సమీపంలోని వడ్లూరు గ్రామ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. వాస్తవానికి వడ్లూరు గ్రామంలో ప్రస్తుతం చిలుకూరి ఇంటి పేరు గలవారు కానీ, వారి సంబంధీకులు కానీ లేరు. అయితే, ఏళ్ల కిందట చిలుకూరి ఉష చిన్న తాత సుబ్రహ్మణ్య శాస్త్రితో పాటు కొందరు చిలుకూరి కుటుంబీకులు ఇక్కడ ఉండేవారు. కృష్ణా జిల్లా నుంచి గోదావరి జిల్లాకు వచ్చేసిన క్రమంలో, చిలుకూరి వంశస్తులు కొందరు వడ్లూరులో కొన్నేళ్లపాటు ఉన్నారు. ఆ తర్వాత వారు కూడా చాగల్లు మండలం మార్కొండపాడుకి వచ్చేసి స్థిరపడ్డారు.
 
వడ్లూరులో ఉన్న సమయంలో తమ కుటుంబానికి చెందిన కొంత భూమిని చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి గ్రామానికి దానంగా ఇచ్చారు. ఆ భూమిలో ఆడిటర్ పెన్మత్స చలపతి రాజు కల్యాణ మండపంతో పాటు సాయిబాబా గుడి కట్టించారు. ఇప్పుడు చలపతి రాజు మనవడు వడ్లూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీను రాజు ఆధ్వర్యంలో స్థానికులు ఆ కల్యాణ మండపంతో పాటు గుడి నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిలుకూరి కుటుంబం గతంలో తమ ఊరిలో నివసించడం, కల్యాణ మండపం నిర్మించడం, దేవాలయం నిర్మించడం గుర్తు చేసుకుని ఆ గ్రామ ప్రజలు బుధవారం సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. తమ ఊరి మూలాలు ఉన్న ఆడబిడ్డ భర్త అమెరికా ఉపాధ్యక్షుడు అవడం చాలా గర్వకారణంగా ఉందని మా ఊరి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.