శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 22 నవంబరు 2024 (13:09 IST)

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

Adani
అమెరికాలో ఇంధనం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో రూ. 84,492 కోట్ల (10 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రకటించారు. ఇప్పుడు అదానీపై అమెరికాలో మోసానికి సంబంధించిన అరోపణలు నమోదయ్యాయి. ఈ పరిణామం స్వదేశంలో, విదేశాల్లో ఆయన వ్యాపార లక్ష్యాలకు అడ్డంకిగా మారొచ్చు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ ఒకరు.
 
62 ఏళ్ల గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడు. ఓడరేవులు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం సుమారు రూ. 14,27,931 కోట్ల (169 బిలియన్ డాలర్లు)కు ఎదిగింది. వచ్చే 20 ఏళ్లలో వేల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చే కాంట్రాక్టులను పొందేందుకు భారత అధికారులకు అదానీ, ఆయన ఎగ్జిక్యూటివ్‌లు లంచాలు ఇచ్చారనేది అమెరికా ఆరోపణ. ఈ క్రమంలో అమెరికా, పలు ఇతర దేశాల్లోని ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ తప్పుడు సమాచారం ఇచ్చిందనేది అభియోగం. ఈ ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. ఇవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టివేసింది. అయితే ఈ ఆరోపణలు ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థపై, అదానీ గ్రూపుపై ప్రభావం చూపుతున్నాయి.
 
అదానీ గ్రూపు సంస్థలు మార్కెట్ విలువ గురువారం 34 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2.8 లక్షల కోట్లు) కోల్పోయింది. మరోవైపు తాజా ఆరోపణలకు కేంద్రంగా ఉన్న అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ కూడా 60 కోట్ల డాలర్ల (సుమారు రూ. 5 వేల కోట్లు) బాండ్ల జారీ విషయంలో ముందుకు వెళ్లలేమని ప్రకటించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టైకూన్ అదానీతో భారత దేశ ఆర్థిక వ్యవస్థ లోతుగా ముడిపడి ఉంది. ఆయన దేశంలో 13 ఓడరేవులు (30 % మార్కెట్ వాటా), ఏడు విమానాశ్రయాల(ప్రయాణికుల రద్దీలో 23 శాతం)తో పాటు సిమెంట్ వ్యాపారం (20% మార్కెట్ వాటా) నిర్వహిస్తున్నారు. దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్ వ్యాపారం అదానీదే.
 
ఆరు బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌లు కూడా ఆయన సొంతం. దేశంలోని విద్యుత్ రంగంలో ఆయనే అతిపెద్ద ప్రైవేట్ ప్లేయర్. గ్రీన్ హైడ్రోజన్‌ రంగంలో 50 బిలియన్ల డాలర్ల(సుమారు రూ. 4 లక్షల కోట్లు) పెట్టుబడి పెడతానని చెప్పడంతో పాటు 8,000 కిమీ పొడవైన సహజ వాయువు పైప్‌లైన్‌ను నిర్వహిస్తున్నారు. దేశంలోని అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేని నిర్మిస్తున్నారు. అలాగే అతిపెద్ద మురికివాడను అందంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఆయన వద్ద 45,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ, అదానీ చేసే వ్యాపారాలు దేశవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాల్లో ఆయన వ్యాపారాలు ఉన్నాయి.
 
ఇండోనేసియా, ఆస్ట్రేలియాల్లో బొగ్గు గనులతో పాటు కెన్యా, మొరాకోలో ఇంధన ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. టాంజేనియా, కెన్యాలోనూ మౌలిక వసతుల ప్రాజెక్టులపై దృష్టి సారించారు. అదానీ పోర్ట్‌ఫోలియో, మోదీ పాలసీ విధానాలకు దాదాపు దగ్గరగా ఉంటుంది. ఆయన పోర్ట్‌ఫోలియో మౌలిక వసతులతో మొదలై ఇటీవల క్లీన్ ఎనర్జీ వరకు విస్తరించింది. మోదీతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రోనీ క్యాపిటలిజంగా విమర్శకులు పిలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడా ఆగిపోలేదు. ఇతర విజయవంతమైన పారిశ్రామికవేత్తల తరహాలోనే అదానీ కూడా చాలామంది ప్రతిపక్ష నేతలతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నారు. వారి రాష్ట్రాల్లోనూ పెట్టుబడులు పెట్టారు.
 
‘‘లంచానికి సంబంధించిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. అదానీ, మోదీ మధ్య విడదీయరాని సంబంధాలు ఉన్నాయి. ఇది భారత రాజకీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయబోతుంది’’ అని అదానీ బిజినెస్ గ్రూపుపై విస్తృతంగా కథనాలు రాసిన భారత జర్నలిస్ట్ పరంజయ్ గుహ థాకుర్తా చెప్పారు. గౌతమ్ అదానీ కంపెనీ దశాబ్దాలుగా స్టాక్ మ్యానిపులేషన్, అకౌంటింగ్‌లో మోసాలకు పాల్పడిందంటూ అమెరికా షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో ఒక నివేదికను విడుదల చేసింది. దురుద్దేశపూర్వకంగా, తప్పుడు సమాచారంతో ఈ నివేదికను రూపొందించారని అదానీ గ్రూపు తోసిపుచ్చింది.
 
ఆ తర్వాత దాదాపు రెండేళ్లుగా తన ఇమేజ్‌ను పునర్నిర్మించుకునేందుకు అదానీ ప్రయత్నిస్తున్న తరుణంలో తాజాగా లంచానికి సంబంధించిన ఆరోపణలు మరోసారి ఆయనను చుట్టుముట్టాయి. తనపై వచ్చిన తాజా ఆరోపణలను అదానీ ఖండించారు. అయినప్పటికీ అవి మార్కెట్ సెల్-ఆఫ్‌ను, దర్యాప్తును ప్రేరేపించాయి. భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. ‘‘అదానీ తన ఇమేజ్‌ను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. హిండెన్‌బర్గ్ గ్రూపు మోపిన ఆరోపణలు నిజం కావని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఆయన కంపెనీ, వ్యాపారాలు సవ్యంగా నడుస్తున్నాయి. గత ఏడాది కాలంలో అనేక కొత్త డీల్స్ చేశారు, పెట్టుబడులు పెట్టారు. కాబట్టి తాజా పరిణామాలు ఆయనకు ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు’’ అని బీబీసీతో అమెరికన్ థింక్ టాంక్ విల్సన్ సెంటర్‌కు చెందిన మైకేల్ కగెల్‌మాన్ అన్నారు.
 
ప్రస్తుతానికి స్వదేశంలో ప్రాజెక్టుల కోసం మూలధనాన్ని సేకరించడం అదానీకి సవాలుగా మారొచ్చు. ‘‘మార్కెట్ స్పందించిన తీరును చూస్తే ఇది ఎంత తీవ్రమైన అంశమో తెలుస్తుంది. ప్రధాన ప్రాజెక్టుల కోసం నిధులను అదానీలు సమకూర్చుకుంటారు. కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది’’ అని బీబీసీతో ఇండిపెండెంట్ మార్కెట్ అనలిస్ట్ అంబరీశ్ బలిగా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్న అదానీ ప్రణాళికలకు తాజా అభియోగాలు ఆటంకంగా మారొచ్చు. ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని టేకోవర్ చేయడంతో పాటు వివాదాస్పద ఇంధన ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే ఆయన కెన్యా, బంగ్లాదేశ్‌లో సవాళ్లను ఎదుర్కొన్నారు.
 
‘‘లంచానికి సంబంధించిన తాజా అభియోగాలు అమెరికాతో అనుసంధానమైన అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలను నిలిపివేస్తాయి’’ అని బీబీసీతో సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నిర్మల్య కుమార్ చెప్పారు. ఇక రాజకీయంగా చూస్తే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే దీనిపై మాట్లాడారు. అదానీని అరెస్ట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ‘‘భారత్‌లోని ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వడం ఇక్కడ వార్త కాదు. కానీ, అందులో పేర్కొన్న మొత్తాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ లంచాన్ని అందుకున్న కొంతమంది పేర్లు కూడా అమెరికా వద్ద ఉండొచ్చని నాకు అనుమానంగా ఉంది. ఇది భారత రాజకీయాల్లో కలకలం రేపొచ్చు. ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటకు రావాలి’’ అని నిర్మల్య కుమార్ భావిస్తున్నారు.
 
‘‘ప్రస్తుతానికి నేరారోపణ మాత్రమే వచ్చింది. బయటపడాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి’’ అని కగెల్‌మాన్ అన్నారు. శ్రీలంకలో ఓడరేవు ప్రాజెక్టు కోసం అమెరికా, అదానీల మధ్య కుదిరిన 50 కోట్ల డాలర్ల ఒప్పందం స్క్రుటినీని ఎదుర్కోవచ్చని అన్నారు. తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటకీ అమెరికా- భారత్‌ల మధ్య విస్తృత వ్యాపార సంబంధాలు బలంగానే ఉంటాయని అన్నారు.