శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (12:02 IST)

ఆగస్టులో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు!!

vande bharat sleeper
ప్రస్తుతం దేశంలో అత్యంత ఆదరణ చూరగొంటున్న వందే భారత్ రైళ్లు కేవలం పగటిపూట మాత్రమే నడుస్తున్నాయి. ఈ తరహా రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం రాత్రిపూట నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లను తయారు చేయిస్తుంది. 
 
ఇందులో భాగంగా, ఇప్పటికే తయారైన తొలి వందే భారత్ స్లీపర్ క్లాస్ రైలును ఆగస్టు నెలలో పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. ఆ తర్వాత దేశంలోని ప్రధాన నగరాల మధ్య విడతలవారీగా వాటిని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 
 
ఇందులోభాగంగా, దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు సికింద్రాబాద్ - ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలున్నాయి. ఈ నగరాల మధ్య ఇప్పటివరకు వందేభారత్ రైళ్లు లేనందున తొలి స్లీపర్ రైలు ఈ మార్గంలో నడపాలని కేంద్ర గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్‌కు తాజాగా సూచించారు. ఈ మేరకు దక్షిణమ మధ్య రైల్వే జోన్, రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. 
 
మరోవైపు సికింద్రాబాద్ - పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ రైలు (సిట్టింగ్) రానున్నట్లు తెలిసింది. బోధన్‌ నుంచి ఖాళీగా వెళ్లి వస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్, తిరుపతి - నిజామాబాద్‌ల మధ్య సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్‌లో ప్లాట్‌ఫాంలు ఖాళీ లేక బోధన్‌కు తీసుకెళుతున్నారు. 
 
ప్రయాణ సమయానికి ముందు బోధన్ నుంచి నిజామాబాద్‌కు తీసుకువస్తున్నారు. రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ - రాజ్‌కోట్‌ల మధ్య రాకపోకలు సాగిస్తోంది. గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందినవారు హైదరాబాద్‌లో పెద్దసంఖ్యలో ఉంటున్నారు. 
 
మరోవైపు కాచిగూడ - బెంగళూరు మధ్య 8 కోచ్‌లతో నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు డిమాండ్ బాగా ఉంది. దాన్ని 16 కోచ్‌లకు పెంచాలన్న డిమాండూ ద.మ. రైల్వే పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తుది దశలో ఉన్న చర్లపల్లి టెర్మినల్ పనుల్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడంపై ద.మ. రైల్వే దృష్టి సారించింది. 
 
ప్రధాన మంత్రి మోడీతో ఈ రైల్వే టెర్మినల్‌ను ప్రారంభింపజేయనున్నట్లు సమాచారం. స్టేషన్‌కు మూడు రహదారులు ఉండగా.. ఒక వైపు కొంత భూసేకరణ అంశం అపరిష్కృతంగా ఉంది. మరో మార్గంలో జీహెచ్ఎంసీ రోడ్డు వేయాల్సి ఉందని ద.మ. రైల్వే వర్గాల సమాచారం.