శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (13:15 IST)

సౌతాఫ్రికాకు తరలిపోనున్న చాంపియన్స్ ట్రోఫీ వేదిక.. పాకిస్థాన్ దూరం!?

champion trophy
వచ్చే యేడాదిలో ఐసీసీ నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సివుంది. అయితే, పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరుకారాదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. ఈ టోర్నీకి భారత్ క్రికెట్ జట్టు దూరమైనపక్షంలో పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. దీంతో మధ్యేమార్గం భారత్ ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను తటస్థ వేదికలైన షార్జా, యూఏఈ వంటి దేశాల్లో నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి ఐసీసీ సమ్మతం తెలిపింది. కానీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం నో చెబుతోంది. 
 
పైగా, తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే ఏకంగా టోర్నీని వీడాలని పాక్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే వరకు.. భారత్‌లో జరిగే మరే ఇతర ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదని పాకిస్థాన్ భావిస్తోందట. 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు తమ ఆసక్తిని తెలియజేస్తూ ఐఓసీ భవిష్యత్‌ ఆతిథ్య కమిషన్‌కు భారత్‌ లేఖ ఇచ్చింది. అయితే పాకిస్థాన్‌ ఇందుకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేయాలనుకుంటుందని పాక్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
 
ఒకవేళ పీసీబీ ఇలాగే మొండిగా వ్యవహరించి హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించకపోతే టోర్నీ మొత్తాన్ని సౌతాఫ్రికాలో నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. 'ప్రస్తుతం హైబ్రిడ్ మోడల్ విధానంలో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడంపై ఎలాంటి చర్చలు జరగలేదు. మొత్తం పరిస్థితిని పీసీబీ అంచనా వేస్తోంది. తదుపరి ఏం చేయాలనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహరంపై పాక్‌ ప్రభుత్వం, బోర్డు చర్చలు జరుపుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బోర్డు పనిచేస్తుంది' అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు.