శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (15:07 IST)

భారత క్రికెట్ జట్టుకు మరో లెజెండరీ క్రికెటర్ ధోనీ దొరికాడు : జురెల్‌పై గవాస్కర్ ప్రశంసలు

భారత క్రికెట్ జట్టుకు మరో క్రికెట్ లెజెండ్ ధోనీ లభించాడని, భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్‌, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ 90 పరుగులు చేశాడు. భారత క్రికెట్ జట్టు మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనిపై మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. లెజెండరీ క్రికెటర్‌ ధోనీతో పోల్చాడు. ఇదే ఆటతీరును కొనసాగిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు.
 
'ధ్రువ్‌ జురెల్‌ ఏకాగ్రత చూస్తుంటే నాకు మరో ఎం.ఎస్‌.ధోనీ తయారవుతున్నాడనిపిస్తోంది. ఈరోజు అతడికి శతకం చేజారి ఉండొచ్చు. కానీ, ఇదే ఏకాగ్రతతో ఆడితే అతడు చాలా సెంచరీలు చేస్తాడు' అని కామెంటరీలో భాగంగా గవాస్కర్ విశ్లేషించాడు. నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి ధ్రువ్‌ 30 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మూడో రోజు కుల్దీప్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన అతడు మరో 60 పరుగులు జోడించాడు.
 
మధ్యాహ్న భోజన విరామానికి ముందు టామ్‌ హార్ట్‌లీ వేసిన బంతికి ధ్రువ్‌ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 149 బంతుల్లో రెండు సిక్సులు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు సాధించాడు. దీంతో కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకునే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు కుల్దీప్‌, జురెల్‌ కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. కుల్దీప్‌ మరోసారి 131 బంతుల్లో రెండు ఫోర్లతో కలిపి 28 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
 
మొత్తానికి నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 307 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ్‌ 90, యశస్వి జైస్వాల్‌ 73, శుభ్‌మన్‌ గిల్‌ 38, కుల్దీప్‌ యాదవ్‌ 28 మాత్రమే రాణించారు. ఇంగ్లండ్‌ జట్టులో యువ బౌలర్‌ బషీర్‌ ఐదు వికెట్లతో విజృంభించాడు. హార్ట్‌లీ 3, అండర్సన్‌ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది.