శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మే 2024 (09:03 IST)

ఐపీఎల్ 2024 : వర్షంతో గుజరాత్ కథ ముగిసింది.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్

ipl2024
ఐపీఎల్‌ 2024 సీజన్ పోటీల్లో భాగంగా, ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా సాగుతుంది. ఈ సమయంలో కీలకమైన మ్యాచ్‌ వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దయింది. దీంతో మిణుకుమిణుకుమంటున్న గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ స్థానం ఖాయం చేసుకున్న కోల్‌కతాతో, ప్లేఆఫ్స్‌ బెర్తు కోసం పోరాడుతున్న గుజరాత్‌ సోమవారం తలపడాల్సి ఉండగా.. వర్షం అవకాశం ఇవ్వలేదు. అహ్మదాబాద్‌ మ్యాచ్‌ ఆరంభ సమయానికంటే ముందే వరుణుడి ప్రతాపం మొదలు కాగా.. రాత్రి 10 గంటల తర్వాత కూడా వర్షం ఆగకపోవడంతో ఆట సాధ్యం కాలేదు. కనీసం 5 ఓవర్ల చొప్పున మ్యాచ్‌ జరిపేందుకు తుది గడువు రాత్రి 10.56 గంటలు కాగా.. పదిన్నర సమయంలోనూ వర్షం పడుతుండడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. 
 
దీంతో కోల్‌కతా, గుజరాత్‌ జట్లకు తలో పాయింట్‌ దక్కింది. ఈ పోరుకు ముందు కోల్‌కతా 12 మ్యాచ్‌లాడి 9 విజయాలతో ప్లేఆఫ్స్‌ బెర్తును సొంతం చేసుకోగా.. 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు మాత్రమే సాధించి రేసులో వెనుకబడింది. ప్లేఆఫ్స్‌ రేసులో ఉండాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా గెలవాలి. అదేసమయంలో వేరే సమీకరణాలు కూడా కలిసి రావాలి. కానీ నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ రద్దవడంతో చివరి మ్యాచ్‌ గెలిచినా టైటాన్స్‌ పాయింట్లు 13కు మించవు. ఇప్పటికే నాలుగు జట్లు 14 పాయింట్లు సాధించిన నేపథ్యంలో టైటాన్స్‌కు దారులు మూసుకుపోయాయి. మరోవైపు 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న కోల్‌కతా.. టాప్‌-2లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. 19కు మించి పాయింట్లు సాధించే అవకాశం రాజస్థాన్‌కు తప్ప మరో జట్టుకు అవకాశం లేకపోవడంతో ఆ జట్టు టాప్‌-2లోనే లీగ్‌ దశను ముగించనుంది.