యశస్వి జైస్వాల్ బాదుడు.. సిక్సర్లు, సెంచరీ రికార్డుల పంట..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇది ఆసీస్ గడ్డపై అతనికి తొలి శతకం. అలాగే ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న తొలిసారే యువ ఆటగాడు శతకం నమోదు చేయడం గమనార్హం.
అలాగే ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్ ఓపెనర్‌గా జైస్వాల్ రికార్డుకెక్కాడు. అతడు 22ఏళ్ల 330 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. కేఎల్ రాహుల్ 22 ఏళ్ల 263 రోజుల వయసులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
అంతేగాక 23 ఏళ్లు రాకముందే ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు శతకాలు బాదిన బ్యాటర్ల జాబితాలో జైస్వాల్‌ది ఐదో స్థానం. పెర్త్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికీ... రెండవ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ మొత్తం 193 బంతులు ఎదుర్కొని 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇందులో 7 ఫోర్లతో పాటు 2 సిక్సర్లు కూడా ఉన్నాయి. దీంతో జైస్వాల్ ఖాతాలో ఒక ప్రపంచ రికార్డు చేరింది. టెస్ట్ ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
పెర్త్ టెస్టులో ఇప్పటివరకు బాదిన 2 సిక్సర్లతో కలుపుకొని 2024లో అతడు కొట్టిన సిక్సర్ల సంఖ్య 34కు చేరింది. 2014లో 33 సిక్సర్లతో న్యూజిలాండ్ మాజీ దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును యశస్వి జైస్వాల్ బద్దలు కొట్టాడు.