సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం
హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తొమ్మిదో తరగతి చదివే 13 యేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణానికి ఆ బాలిక పెద్దమ్మే తన వంతు సహకారం అందించడం గమనార్హం. తనకు జరిగిన ఘోరంపై ఆ బాలిక తాను చదువుకునే పాఠశాల ఉపాధ్యాయురాలి దృష్టికి తీసుకెళ్లగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు మొత్తం ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల కథనం మేరకు 13 యేళ్ల బాలిక తన పెద్దమ్మ వద్ద ఉంటూ స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమె పెద్దమ్మకు కడప జిల్లాకు చెందిన సినీ కో డైరెక్టర్ బండి వెంకట శివారెడ్డి, కెమెరామెన్ పెనికలపాటి అనిల్ అనే ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఉంది. వీరిద్దరూ తరరచూ ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో ఆ బాలికపై వారు కన్నేశారు. సినీ పరిశ్రమంలో తమకు మంచి పలుకుబడి ఉందని, వారితో చనువుగా ఉంటే మంచి సినిమా అవకాశాలు ఇప్పిస్తారని బాలికను పెద్దమ్మే నమ్మించిది.
దీంతో పెద్దమ్మ మాటలు నమ్మిన ఆ బాలిక.. ఆ ఇద్దరితో చనువుగా ఉండసాగింది. ఈ క్రమంలో ఆ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. దీంతో లోలోపల మదన పడిన ఆ బాలిక చివరకు ధైర్యం చేసి తన పాఠశాల ఉపాధ్యాయురాలికి జరిగిన అన్యాయాన్ని వివరించగా, ఆమె ఫిల్మ్ నగర్ పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులతో పాటు బాలిక పెద్దమ్మను కూడా అరెస్టు చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.