1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 మే 2025 (10:04 IST)

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

murder
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. స్థానిక నాంపల్లిలో రౌడీ షీటర్ అయాన్ ఖురేషీ హత్యకు గురయ్యాడు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు నుంచి తిరిగి వస్తుండగా ఐదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. బ్యాట్‌తో కొట్టి, కత్తులతో గొంతుకోసి అతి కిరాతకంగా చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చంద్రాయణగుట్టకు చెందిన అయాన్ ఖురేషీ అనే వ్యక్తిపై రౌడీషీట్ ఉంది. ఓ కేసు నిమిత్తం నాంపల్లి కోర్టులో హాజరై తిరిగి ఇంటికి వెళుతున్నాడు. దీన్ని అదనుగా భావించిన ప్రత్యర్థులు ఖురేషీ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి వద్దకు రాగానే, ఒక్కసారిగా దాడి చేశారు. మొత్తం ఐదుగురు దుండగులు ఖురేషీని క్రికెట్ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత కత్తులతో గొంతుకోసి, పొట్టలో విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. నిందితులు హత్యకు ఉపయోగించిన బ్యాట్, కత్తులను సంఘటనా స్థలంలోనే వదిలి పరారయ్యారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.