ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసి వాగులో పడేసిన కిరాతక కుమారుడు
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతండ్రిని ఓ కిరాతక కుమారుడు దారుణంగా హత్య చేసి, శవాన్ని వాగులో పడేశాడు. ఆస్తి పంపకంలో ఏర్పడిన వివాదం విషాదాంతంగా ముగిసింది. పోలీసుల కథనం మేరకు..
కల్వకుర్తి పట్టణంలోని వాసవి నగర్‌కు చెందిన బాలయ్య (70) తన వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకుంటుండగా, బీరయ్య అక్కడికి వెళ్లి తండ్రితో ఆస్తి విషయంలో గొడవ పడ్డాడు. వారి మధ్య వాగ్వివాదం ముదరడంతో బీరయ్య కర్రతో తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
తర్వాత, బాలయ్య మృతదేహాన్ని బీరయ్య కారు డిక్కీలో వేసుకొని చింతపల్లి బ్రిడ్జ్ వద్దకు తీసుకువెళ్లి వాగులో పడేశాడు. అయితే, బాలయ్య రాత్రివరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అతని కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా, బీరయ్యే తండ్రిని హత్య చేసినట్లుగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నాడు. బీరయ్య తెలిపిన సమాచారంతో గజ ఈతగాళ్ల సహాయంతో బాలయ్య మృతదేహాన్ని డిండిచింతపల్లి బ్రిడ్జ్ వద్ద వాగు నుంచి వెలికితీయించారు. ఘటనపై పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.