వైద్య విద్యార్థినిపై అత్యాచారం - పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, వీరి వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించకపోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
ఒరిస్సా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాకు చెందిన యువతి(23) దుర్గాపుర్‌లోని శోభాపుర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. పలువురు దుండగులు వీరిని వెంబడించారు.
బాధితురాలిని బెదిరించి సమీప అడవిలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాధితురాలిని బెదిరించారు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పిన బాధితురాలిని గమనించిన కొందరు స్థానికులు సమీప ఆసుపత్రిలో చేర్పించగా.. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఆమె తల్లిదండ్రులు శనివారం ఉదయం దుర్గాపుర్ చేరుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బాధితురాలి స్నేహితుడు కూడా ఈ నేరంలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని తప్పుదారిపట్టించి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడని.. ఆ తర్వాత ఆమె నుంచి ఫోన్, డబ్బును లాక్కొన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనలో బాధితురాలి స్నేహితుడితోపాటు చాలా మందిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు.