శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2024 (17:34 IST)

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

murder
ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన తండ్రికి రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు తనకే దక్కాలన్న దురాశతో తన తోడబుట్టిన అన్నదమ్ములిద్దరినీ ఓ కసాయి చెల్లి చంపేసింది. ఆ తర్వాత చేసిన తప్పుతో మానసిక సంఘర్షణకులోనై.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించింది. ఈ దారుణం ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. 
 
ఈ జంట హత్యల వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని నకరికల్లుకు చెందిన తలపల పోలురాజు స్థానిక రామదాసు కాలనీలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు గోపి కానిస్టేబుల్‌‍గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసై కొంతకాలంగా విధులకు వెళ్లడం లేదు. అతడితో గొడవలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. గోపి సోదరి కృష్ణవేణికి పెళ్లయ్యింది. నాలుగేళ్ల కిందట విడాకులు తీసుకుని, నకరికల్లులోని పుట్టింట్లోనే ఉంటూ.. మరొకరితో సహజీవనం చేస్తోంది. 
 
వీరి సోదరుడు దుర్గా రామకృష్ణ రామదాసుకాలనీలో ఉంటున్నాడు. భార్యతో సఖ్యత లేక అతడూ విడాకులు తీసుకున్నాడు. వారి తండ్రి పోలురాజు ఈ ఏడాది జనవరిలో అనారోగ్యంతో చనిపోయాడు. అతనికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఈ ముగ్గురి మధ్య విభేదాలు వచ్చాయి. తండ్రి బాగోగులు తానే చూశానని, ఆర్థిక ప్రయోజనాల్లో తనకూ వాటా ఇవ్వాలని, కారుణ్య నియామకంలో భాగంగా వచ్చే ఉద్యోగం తనకు వచ్చేలా చూడాలని ఆమె సోదరులను కోరింది. 
 
ఈ విషయంలో దుర్గా రామకృష్ణ తనకు అడ్డువస్తాడనే ఉద్దేశంతో నవంబరు 26న మేజరు కాల్వలోకి నెట్టి అతడిని చంపేసింది. ఆర్థిక ప్రయోజనాలకు ఎక్కడ అడ్డు పడతాడోననే ఉద్దేశంతో తన అన్న, కానిస్టేబుల్ గోపిని డిసెంబరు 10న మద్యం తాగించి.. మెడకు చున్నీ బిగించి చంపేసింది. మృతదేహాన్ని బ్రాంచ్ కెనాల్లో పడేసింది. 20 రోజుల వ్యవధిలో అన్నదమ్ములిద్దరినీ చంపేసిన ఆమె.. తానే స్వయంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి చేసిన నేరాన్ని అంగీకరించింది. 
 
దుర్గా రామకృష్ణను గత నెల 28న హత్య చేసి కాలువలో పడేసిన మృతదేహం, కానిస్టేబుల్ గోపి మృతదేహం కోసం కూడా గాలిస్తున్నారు. ఈ నెల 14న ముప్పాళ్ల పవర్ ప్లాంట్ వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ మృతదేహం ఎవరిదనే విష యమై డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ అన్నదమ్ముల మిస్సింగ్ లేదా హత్యలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, అందువల్ల ఎలాంటి కేసు నమోదు చేయలేదని స్థానిక పోలీసులు తెలిపారు.