మంగళవారం, 11 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 నవంబరు 2025 (20:50 IST)

అద్దెకొచ్చిన మహిళతో అక్రమ సంబంధం... పెళ్లికి ఒత్తిడి చేయడంతో చంపేసిన యజమాని...

murder
తమ ఇంట్లో అద్దెకు దిగిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇంటి యజమాని చివరకు ఆ మహిళను హత్య చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ దుండిగల్‌లో వెలుగు చూసింది. ఈ కేసులో ఇంటి యజమానితో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 
 
మెదక్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వాతి (28)కి 2015లో రమేశ్ వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. అయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. స్వాతి తన చిన్న కొడుకుతో కలిసి దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పల్లి, గ్రీన్ హిల్స్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు దిగింది.
 
ఈ క్రమంలో ఇంటి యజమాని, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన బోయ కిషన్‌తో స్వాతికి పరిచయం ఏర్పడింది. ఆయనకు అప్పటికే వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ స్వాతితో చనువు పెంచుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తనను రెండో పెళ్లి చేసుకోవాలని స్వాతి, కిషన్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. 
 
ఈ విషయం కిషన్ ఇంట్లో తెలియడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. స్వాతి నుంచి వస్తున్న ఒత్తిడి, ఇంట్లో సమస్యలు భరించలేని కిషన్, ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
 
ఇందుకోసం తన అల్లుడు రాజేశ్, తన వద్ద పనిచేసే వంశీల సహాయం తీసుకున్నాడు. రాజేశ్, వంశీ పక్కా ప్రణాళికతో శనివారం ఉదయం 6 గంటల సమయంలో స్వాతి ఇంట్లోకి చొరబడి, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు చూస్తుండగానే కత్తితో గొంతు కోసి పాశవికంగా హత్య చేసి పరారయ్యారు. 
 
కళ్ల ముందే తల్లి హత్యకు గురవడంతో ఆ చిన్నారి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు బోయ కిషన్‌తో పాటు రాజేశ్, వంశీని అదుపులోకి తీసుకున్నారు. 
 
వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఒక కారు, మూడు మొబైల్ ఫోనులను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను రిమాండ్‌కు తరలించామని మేడ్చల్ పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.