శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 7 అక్టోబరు 2024 (15:52 IST)

Sanatana Dharma: DMK కంచుకోటను పవన్ కల్యాణ్ బద్దలు కొడతారా?

pawan kalyan
సనాతన ధర్మం అనేది ఒక వైరస్, ఒక బ్యాక్టీరియా, ఒక దోమ, కరోనా వైరస్ లాంటిది... దాన్ని చంపేయాలంటూ డీఎంకే ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించడంపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని అనుకునేవారు వాళ్లే తుడిచిపెట్టుకుపోతారంటూ తిరుపతి వారాహి సభలో చెప్పారు. ప్రత్యేకించి పేరు చెప్పకపోయినప్పటికీ పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు నేరుగా డీఎంకే ఉపముఖ్యమంత్రి ఉదయనిధినిని ఉద్దేశించినవేనని తెలుస్తోంది. దీనిపై కొందరు విలేకరులు ఉదయనిధిని ప్రశ్నించగా వెయిట్ అండ్ సీ అని సమాధానమిచ్చారు.
 
సనాతన ధర్మం అంటే ఏమిటి?
హిందూమతంకి మారుపేరే సనాతన ధర్మం, దీని అర్థం "అనాదిగా వస్తున్న సరైన జీవన విధానం". ఆధ్యాత్మిక పండితులు చెప్పిన దాని ప్రకారం సనాతన ధర్మం అంటే... ఆది మరియు అంతం లేనిదని, అంటే... దాని పుట్టుక ఎప్పుడో ఎవరికీ తెలియదు అలాగే దాని అంతం ఎప్పుడనేది కూడా ఎవ్వరూ చెప్పలేరు. భారతదేశంలో 5000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి మూలాలతో స్థాపించబడిన, అన్ని నమ్మక వ్యవస్థలలో హిందూ మతం పురాతనమైనదిగానూ, అత్యంత సంక్లిష్టమైనదిగానూ చెప్పబడింది. విష్ణువు, బ్రహ్మ, శివుడు, సరస్వతి, దుర్గామాత ఈ సనాతన ధర్మాన్ని స్థాపించారని హిందువుల విశ్వాసం. ఇటువంటి సనాతన ధర్మాన్ని కరోనా వైరస్ వంటిది అని డిఎంకే కీలక నాయకుడు ఉదయనిధి పేర్కొనడంతో దుమారం రేగింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
 
Udhayanidhi Stalin
సనాతన ధర్మంపై వ్యాఖ్య, డీఎంకెకి నష్టం వాటిల్లుతుందా?
సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, అందుకే నిర్మూలించాలని డిఎంకె నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటన వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఉదయనిధి వ్యాఖ్యలపై ఆయన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తన కుమారుడు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఏ మతానికి వ్యతిరేకమైనవి కావనీ, కేవలం సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవని అన్నారు. ఐనప్పటికీ ఉదయనిధి 2023లో చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఆయనపై గత ఏడాది సెప్టెంబరు 6న IPC సెక్షన్లు 295 A (ఏ వర్గానికి చెందిన మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా వారి మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో మరియు హానికరమైన చర్యలు), 153 A (రెండు వేర్వేరు సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఈ కేసులు ఉత్తరప్రదేశ్‌లో నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
సనాతన ధర్మం గురించి మాట్లాడి.. హిందువుల మనోభావాలను దెబ్బతీసారనే వ్యాఖ్యలు తమిళనాట వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. టెంపుల్ స్టేట్ అనే పేరున్న తమిళనాడులో హిందు జనాభా సంఖ్య తక్కవేమీ కాదు. కనుక ఉదయనిధి వ్యాఖ్యలు ఆ డిఎంకే పార్టీకి నష్టం చేస్తాయేమోనన్న ఆందోళనలో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు వున్నట్లు తెలుస్తోంది.
 
pawan kalyan
తమిళనాడులో పవన్ కల్యాణ్ ప్రభావం వుంటుందా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో Pawan Kalyan vs Udayanidhi Stalin అనే ట్యాగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల తిరుపతి వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.... సనాతన ధర్మాన్ని తుదముట్టిస్తామంటూ ఓ తమిళనాయకుడు మాట్లాడుతున్నాడనీ, ఐతే సనాతన ధర్మం జోలికి వస్తే వారే తుడిచిపెట్టుకుపోతారంటూ వ్యాఖ్యానించారు. అది కూడా తమిళ భాషలో చెప్పడంతో ఆ వ్యాఖ్యలు ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించి చేసినవేనని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని ప్రభావం వుండే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.