సోమవారం, 8 సెప్టెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (10:55 IST)

Onam: పాతాళం నుంచి బలి చక్రవర్తి భూమి పైకి వచ్చే రోజు ఓనమ్

Onam Festival
ఓనం. ఈ పండుగ మలయాళీలకు అత్యంత ముఖ్యమైనది. మలయాళీ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం తొలి నెలలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ ఆగస్ట్- సెప్టెంబర్ నెలల్లో వస్తుంది. దీనిని శ్రావణోత్సవం అని కూడా అంటారు. అంతేకాదు పంట కోతల కాలంలో ఈ పండుగను జరుపుకుంటారు. చింగమ్ నెలలో జరుపుకునే ఈ పండుగ వేడుకలు పది రోజులపాటు జరుగుతాయి.
 
వామనావతారంలో పాతాళంలోకి బలిచక్రవర్తిని నెట్టిన విష్ణుమూర్తి, బలిచక్రవర్తి కోరిక మేరకు ఏడాదికి ఓసారి తన ప్రజలను చూసేందుకు వచ్చేలా వరమిచ్చాడు. దీంతో ప్రతి ఏడాది బలిచక్రవర్తి తమ ఇళ్లకు వచ్చి ప్రజల సంతోషాన్ని చూస్తాడన్నది భక్తుల నమ్మకం. ఆ రోజే ఓనమ్ పండుగ అతి వైభవంగా జరుపుకుంటారు. పేదవాళ్లు, ధనవంతులు అని భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా పండుగ వేడుకలను జరుపుకుంటారు.
 
Onam
అథమ్‌తో తొలి రోజు వేడుకలు ప్రారంభమయి తిరుఓనమ్‌తో పది రోజుల సంబరాలు ముగుస్తాయి. ఈ తిరుఓనమ్ చాలా ముఖ్యమైనది. ఈ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఇందులో తప్పకుండా పాల్గొనాలనే ఆచారం వారికి ఉంది.
 
ఈ పండుగ సందర్భంగా కేరళలో ఎక్కడ చూసినా... ఏనుగుల స్వారీలు, అందమైన తెల్లచీరలతో మగువలు. అంతా కోలాహలంగా ఉంటుంది. ఈ పండుగ ప్రత్యేకత పడవ పంద్యాలే. ఈ పండుగ సందర్భంగా ఇంటిని పేడనీళ్లతో అలికి రంగురంగుల పువ్వులతో అందంగా అలంకరిస్తారు. దీనిని వల్లమ్‌కలి అని అంటారు. సాంప్రదాయక పడవలు ఈ పందేల్లో పాల్గొంటాయి. ఈ పండుగ మలయాళీయలదే అయినప్పటికీ, అన్ని వర్గాలవారూ జరుపుకుంటారు.
 
ఓనమ్ పండుగనాడు భుజించే వంటకాల సమాహారం పేరు సాద్య. అన్నట్లు ఈ సాద్యతో ఒకరోజుకు కావల్సిన కేలరీలన్నీ ఒక్కసారిగా ఒనగూరుతాయట. ఈ వంటకాలను భుజించడం పూర్తయిన తర్వాత, ప్రజలు ఆటలు, పాటలు అంటూ చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఇందులో భాగంగా యువకులు శారీరక శ్రమ కలిగే ఆటలు ఆడుతారు. అయితే పెద్దవారు మాత్రం ఇంట్లోనే చెస్, పేకాట తదితర ఆటలు ఆడుతూ సంతోషంగా ఉంటారు. బాల్ ఆటలు, విలువిద్యా పోటీలు, కబడ్డీ, కత్తి యుద్ధాలు.. వంటి క్రీడలలో పాల్గొంటారు.
 
ఇక పండుగ సందర్భంగా మహిళలు నృత్యాలతో తమదైన శైలిలో సందడి చేస్తారు. ఓనమ్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన నాట్యాలు ఉన్నాయి. అందులో కైకొట్టికలై, తుంబి తుల్లల్‌లు ముఖ్యమైనవి. కేరళ మహిళలు తమ సాంప్రదాయ బంగారు రంగు అంచు కలిగిన తెల్లని చీరలు ధరించి చప్పట్లు కొడుతూ ఈ కైకొట్టికలై అనే నాట్యము చేస్తారు. ఈ ఆటలు, నాట్యాలు కేరళ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తప్పకుండా జరుగుతాయి. అంతేకాదు, పండుగ వేడుకల్లో టపాసులు కాల్చి ఇంటిని దీపాలతో నింపేస్తారు.