శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 జులై 2024 (15:03 IST)

టెక్సాస్‌లో బీభత్సం సృష్టిస్తున్న బెరిల్ తుఫాను!

cyclone
అమెరికాలోని టెక్సాస్ నగరంలో బెరిల్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. బెరిల్ కారణంగా వీస్తున్న బలమైన గాలులు, కుండపోత వర్షం కారణంగా సోమవారం టెక్సాస్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడటంతో 2.7 మిలియన్లకు పైగా ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోయారు. వరద నీటి తాకిడి వల్ల రహదారులు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. వేలాదిగా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అలాగే 1,300కు పైగా విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.
 
ఇక గతవారం బెరిల్ హరికేన్.. జమైకా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్‌లో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇది టెక్సా‌స్‌కు చేరుకునేలోపు మెక్సికో, కరేబియన్ దీవుల్లో కనీసం 11 మంది ప్రాణాలు తీసినట్టు లెఫ్టినెంట్ గవర్నర్ దాన్ పాట్రిక్ తెలిపారు. హ్యూస్టన్ మీదుగా వెళ్లడానికి ముందు ఈ ప్రమాదకరమైన తుఫాను తీరప్రాంతమైన టెక్సాస్ పట్టణం మాటగోర్డాను తాకిందన్నారు.
 
తుఫాను కారణంగా హ్యూస్టన్ ప్రాంతంలో ఇళ్లపై చెట్లు కూలిన ఘటనలో 53 ఏళ్ల వ్యక్తి, 74 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందారు. అలాగే హ్యూస్టన్ నగరానికి చెందిన ఓ ఉద్యోగి పనికి వెళ్తున్న సమయంలో అండర్ పాస్‌లో మునిగిపోయి చనిపోయినట్లు పాట్రిక్ చెప్పారు. ఇక విద్యుత్ ప్రసారాన్ని పునరుద్ధరించడానికి చాలా రోజులు పడుతుందని టెక్సాస్ పబ్లిక్ యుటిలిటీ కమిషన్ చైర్ థామస్ గ్లీసన్ వెల్లడించారు. 
 
సోమవారం తెల్లవారకముందే గాల్వెస్టన్, సార్జెంట్, లేక్ జాక్సన్, ఫ్రీపోర్ట్ వంటి నగరాల్లో బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెల్లవారుజామున హ్యూస్టన్లో చాలా చెట్లు నేలకూలాయి. ఇక భారీగా పోటెత్తిన వరదల వల్ల రహదారులు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. హ్యూస్టన్‌‌లోని చాలా ప్రాంతాలలో వరద నీరు 10 అంగుళాలు (25 సెం.మీ.) మించి ప్రవాహిస్తోందని మేయర్ జాన్ విట్మెర్ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు.