శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2024 (14:55 IST)

నూతన వలస విధానాన్ని తీసుకొచ్చిన కెనడా .. విద్యార్థుల నిరసనలు

Canada PM
కెనడా ప్రభుత్వం సరికొత్త వలస విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో ఈ విలస విధానానికి వ్యతిరేకంగా భారతీయ విద్యార్థులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త విధానాన్ని అడ్డుపెట్టుకుని తమను స్వదేశానికి పంపుతారేమోనన్న ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు.
 
ప్రముఖ జాతీయ చానెల్ కథనం మేరకు.. ప్రస్తుతం కెనడా తెచ్చిన కొత్త వలస విధానంతో దాదాపు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. తమను వెనక్కి పంపుతారనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. దాంతో వాళ్లు ఆందోళనలకు దిగుతున్నారు.
 
అంతర్జాతీయ విద్యార్థులు, మరీ ముఖ్యంగా భారతీయులు మంచి భవిష్యత్తు కోసం ఉత్తర అమెరికా దేశాలకు భారీ మొత్తంలో వలస వెళ్తుంటారు. అందులో అమెరికా, కెనడాకు వెళ్లడానికి ఎక్కువ శాతం మంది ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, కెనడా నూతన వలస విధానం ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించే అవకాశం ఉంది.
 
ఈ నేపథ్యంలోనే కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్‌లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎదుట భారతీయ విద్యార్థులు క్యాంపు ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గడిచిన మూడు నెలలుగా ఈ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఇటువంటి ఆందోళనలే ఆంటారియో, మనిటోబా, బ్రిటిష్ కొలంబియాల్లోనూ జరుగుతున్నాయి.
 
ఇక కొత్త వలస విధానం కారణంగా శాశ్వత నివాస నామినేషన్లు 25 శాతం మేర తగ్గనున్నాయి. దీంతో పాటు స్టడీ పర్మిట్లు కూడా పరిమితమవుతాయి. దాంతో భారతీయ విద్యార్థులకు అధిక నష్టం కలుగుతుందని తెలుస్తోంది.
 
కాగా, కెనడా కొత్త వలస విధానం తీసుకురావడానికి ప్రధాన కారణం ఆ దేశంలో విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరగడమే. ఎంతగా అంటే గత ఏడాదిలో పెరిగిన దేశ జనాభాలో 97 శాతం మంది విదేశాల నుంచి వచ్చి స్థిరపడినవారే ఉన్నట్లు ఫెడరల్ డేటా తెలిపింది. ఇలా జనాభా విపరీతంగా పెరగడంతో స్థానికంగా ఇళ్లు, ఉద్యోగాల సంక్షోభం తలెత్తింది. దీంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.