గురువారం, 25 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 సెప్టెంబరు 2025 (13:33 IST)

భారత్‌లో దాడులకు కుట్ర... పాక్ దౌత్యవేత్తకు ఎన్.ఐ.ఏ సమన్లు

court
భారత్‌లో దాడులకు కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ దౌత్యవేత్తకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) సమన్లు జారీచేసింది. మనీలాండరింగ్‌ కేసులో భాగంగా అతడిని విచారణకు పిలిచింది. భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్‌ కాన్సులేట్లపై దాడులకు కుట్రలు పన్నాడని ఆ సమన్లలో పేర్కొంది. కరాచీలోని అతడి చిరునామాను కూడా నోటీసుల్లో ప్రస్తావించింది.
 
రికార్డుల ప్రకారం.. సిద్దిఖీ శ్రీలంకలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌లో వీసా కౌన్సిలర్‌గా చివరిగా విధులు నిర్వర్తించాడు. 2018లో ఎన్‌ఐఏ అతడిని వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఫొటోను విడుదల చేసింది. అతడి నిక్‌నేమ్‌ బాస్‌ అని ఉంటుంది. దక్షిణ భారతదేశంలో 26/11 తరహా దాడులకు కుట్ర పన్నాడని పేర్కొంటూ అదే ఏడాది ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2009 నుంచి 2016 మధ్య శ్రీలంకలో పని చేస్తున్నప్పుడు గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేవారితో సంబంధాలు నెరిపాడని ఎన్‌ఐఏ తన దర్యాప్తులో గుర్తించింది.
 
అసలు 2014లోనే సిద్దిఖీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విధ్వంసం సృష్టించేందుకు సిద్దిఖీ ఆదేశాల మేరకు భారత్‌కు వచ్చిన శ్రీలంక జాతీయుడు మహమ్మద్‌ సఖీర్‌ హుస్సేన్ అప్పట్లో చెన్నైలో పోలీసులకు చిక్కాడు. ఆ కేసులో పాక్ దౌత్యవేత్తపై తొలి కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆ కేసును అదే ఏడాది ఎన్‌ఐఏకు బదిలీ చేశారు.