శుక్రవారం, 14 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

పోక్సో కేసులో మాజీ ముఖ్యమంత్రి యడ్డీకి బిగ్ రిలీఫ్!

yaddyurappa
పోక్సో కేసు నుంచి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప(యడ్డీ)కు స్వల్ప ఊరట లభించింది. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించారన్న కేసులో యడ్యూరప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇందులో న్యాయస్థానం ఆయనకు స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 15వ తేదీ ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకావాలంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశించింది. దీనిపై ఆయన కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా, కింది కోర్టు సమన్లను నిలిపివేసింది. 
 
కాగా, 17 యేళ్ల బాలికపై యడ్యూరప్ప లైంగికదాడికి పాల్పడినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి గత యేడాది ఫిబ్రవరి 2వ తేదీన నాడు ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. 
 
దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే, ఈ ఆరోపణలను యడ్యూరప్ప కార్యాలయం ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇదే తరహా ఆరోపణలు చేశారని పేర్కొంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్పకు కర్నాటక హైకోర్టు స్వల్ప ఊరట కల్పించింది. కాగా, ఈ ఆరోపణల కేసు కర్నాటక రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన విషయం తెల్సిందే.