వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో నిరసనలు : మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్
వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ దేశంలో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. లక్ష మందికి పైగా ఆందోళనకారులు పాల్గొన్న ఈ ర్యాలీకి ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీలో మస్క్ వర్చువల్‌గా మాట్లాడారు. యూకేలో పాలన మార్పునకు పిలుపునిచ్చారు. దేశం విధ్వంసం అంచున ఉందని హెచ్చరించారు.
'బ్రిటన్ పౌరుడిగా ఉండటం గొప్ప విషయం. కానీ, దేశం నాశనం అవడం నేను ఇప్పుడు చూస్తున్నా. చిన్నకోతగా ఇది మొదలైంది. కానీ, ఇప్పుడు భారీగా అక్రమ వలసలతో నిండిపోయింది. ఇది ఇలానే కొనసాగితే మీరు హింసను కోరుకోకపోయినా.. విధ్వంసం మీ వరకు వస్తుంది. ఇప్పుడు మీ వద్ద ఉన్నవి. రెండే మార్గాలు. తిరిగి పోరాడండి.. లేదంటే చనిపోతారు. ఇదే నిజమని నేను అనుకుంటున్నా' అని మస్క్ అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలని మస్క్ డిమాండ్ చేశారు. బ్రిటన్‌లో ప్రభుత్వ మార్పు జరగాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వెంటనే పార్లమెంటును రద్దు చేసి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా మస్క్ ప్రస్తావిస్తూ.. యూఎస్ లో హింస పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.