శుక్రవారం, 12 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 సెప్టెంబరు 2025 (15:32 IST)

నేపాల్‌లో బద్ధలవుతున్న జైళ్లు.. పారిపోతున్న ఖైదీలు

Jail
అంతర్గత ఘర్షణలతో అట్టుడికిపోతున్న పొరుగు దేశం నేపాల్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. దీంతో ఆ దేశంలో తిరుగుబాటు మొదలైంది. ఈ ఉద్యమానికి జెన్ జడ్ నాంది పలికింది. ఫలితంగా రోడ్లపైకి వచ్చిన ఆందోళన, ఉద్యమకారుల దెబ్బకు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు కూడా పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో నేపాల్‌లో శాంతిభద్రత పరిరక్షణకు సైన్యం నడుం బిగించింది. మరోవైపు, నేపాల్‌లోని జైళ్లు బద్ధలైపోతున్నాయి. ఆ జైళ్ళ నుంచి ఖైదీలు పారిపోతున్నారు. 
 
జెన్-జెడ్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరాగా తీసుకొని జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రామెచాప్ జైలు నుంచి పారిపోతున్న కొందరు ఖైదీలపై ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో దేశంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  
 
గురువారం జైలు గేటు తాళాలను విరగ్గొట్టి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్యామకృష్ణ థామా పేర్కొన్నారు. వారిని అడ్డగించేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయన్నారు. ఈ కాల్పుల్లో డజను మందికి పైగా ఖైదీలు గాయపడ్డారని వెల్లడించారు. వారికి వైద్యచికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. 
 
అయితే, ఖాట్మండు, పోఖరా, లలిత్‌పూర్‌లోని జైళ్ల నుంచి ఇప్పటికే వందలాది మంది ఖైదీలు తప్పించుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. మొత్తం 7,000 మంది ఖైదీలు పరారైనట్లు తెలుస్తోంది. ఇక, జైలు నుంచి పారిపోయి వస్తున్న నేపాలీ ఖైదీలను భారత సాయుధ పోలీసుదళం సశస్త్ర సీమా బల్ (SSB) పట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ సమీపంలో 22 మంది నేపాలీ ఖైదీలను అడ్డుకున్నట్లు ఎస్ఎస్బీ అధికారులు తెలిపారు. నేపాల్లో ఆందోళనల నేపథ్యంలో సరిహద్దుల్లో ఎస్ఎస్బీనే భద్రతను పర్యవేక్షిస్తుంది.