గురువారం, 18 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (13:34 IST)

Mirai Review: తేజ సజ్జ, మంచు మనోజ్ ల మిరాయ్ చిత్రంతో అనుకుంది సాధించారా.. రివ్యూ

Mirai -Teja Sajja
నటీనటులు : తేజ సజ్జ, మంచు మనోజ్, రితిక నాయక్, శ్రియా శరన్, జగపతి బాబు, జైరాం, గెటప్ శ్రీను
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, సంగీత దర్శకుడు : గౌర హరి, నిర్మాతలు : టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, దర్శకుడు : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
 
హనుమాన్ చిత్రం తర్వాత మిరాయ్ అంటూ తేజ సజ్జ నటించిన సినిమా ఎలావుంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. అందులో మంచు మనోజ్ నటిస్తున్నాడనగానే ఏదో జరగబోతోందని అర్థమయింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ట్రైలర్ రిలీజ్ చేశాక ఒక్కసారిగా అందరినీ థ్రిల్ కలిగింది. మనోజ్ విలన్ గా సరిపోయాడని ప్రశంసలు దక్కాయి. నిర్మాత విశ్వప్రసాద్ టీమ్ టెక్నికల్ వర్క్, సి.జి., డిజి. వర్క్ ను చేయడంతో విదేశాల్లో వెల్లకుండా హైదరాబాద్ లోనే చేశామని చెప్పడం విశేషం. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
క్రీ.పూ. కళింగ యుద్ధంలో చుట్టూ రక్తపాతం, మ్రుతదేహాలు చూశాక అశోక చక్రవర్తిలో పరివర్తన కలుగుతుంది. తనకున్న దైవశక్తులతో ఇదంతా చేసినందుకు ప్రాయశ్చితం చెంది తనలోని దివ్య శక్తులని మొత్తం 9 గ్రంథాలలో నిక్షిప్తంచేసి 8 గ్రంథాలను ఒక్కో రక్షసుడికి ఇస్తాడు. 9వ గ్రంథాన్ని నేపాల్ దగ్గర హియాలయాల్లో తపస్సు చేసుకునే అంబిక (శ్రియా శరన్) రక్షలో ఉంటుంది.  అక్కడ రాముని బాణం ఓ ఆయుధంగా భ్రదపరిచి వుంటుంది. దానికి రాముడి కాలంనాటి జఠాయువు (పక్షి) రక్షణగా వుంటుంది. దానిని పొందిన వ్యక్తే చెడు శక్తులతో దైవాన్ని పొందాలనుకునేవారికి మరణశాసనం చేస్తుంది. 
 
ఇక, చిన్నతనం నుంచి సమాజంలో అవమానాలు పొందడంతో క్రూరంగా మారి తంత్రవిద్యల్ని నేర్చుకున్న మహాబీర్ (మంచు మనోజ్) 9వ గ్రంథాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో ఏమి జరిగింది?  గ్రంథాన్ని రక్షించే బాధ్యతను తన కొడుకు వేద (తేజ సజ్జ)ను ఎందుకు పణంగా పెట్టింది? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
సినిమా ఆరంభంలోనే ఇతిహాసాలు, పురాణాలు ఎందుకున్నాయనేది క్లారిటీగా ప్రభాస్ వాయిస్ తో దర్శకుడు చెప్పించాడు. మనకు అర్థంకాని ఆందోళనలు, సమస్యలకు అవి మార్గదర్శకాలంటూ సాగిన కథతో ప్రేక్షకుడిని కనెక్ట్ చేయగలిగాడు. ఆ తర్వాత ఒక్కోసీన్ కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. అందుకు పాత్రలతోపాటు సంగీతం, కెమెరా పనితం, డి.ఐ. వర్క్ ఆకర్షణగా నిలిచాయి. చిన్న పిల్లల నుంచి పెద్దలు కూడా చూసి ఆనందించేలా వుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
 
బాహుబలి, ఆర్.ఆర్.ఆర్. సినిమాలతో దర్శకుడు రాజమౌళి ఓ ట్రెండ్ స్రుష్టిస్తే మిరాయ్ కు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న కథ తన విజన్ ఈ సినిమాలో గ్రాండ్ గా కనిపించేలా చేశాడు. తన శక్తికి మించి పెట్టిన ఎఫర్ట్స్ భారీ విజువల్స్ అందులో డివోషనల్ గా ఇచ్చిన ఎలివేషన్స్ లో తన విజన్ కనిపిస్తుంది. తేజ సజ్జ రోల్ అమాయకుడినుంచి తన అడ్వెంచరస్ ప్రయాణం అందులోని సవాళ్లు డిజైన్ చేయడంలో క్రుతక్రుత్యుడయ్యాడు. యాక్షన్ పార్ట్ లో మనోజ్, సజ్జా పోటాపోటీ చేశారు. ప్రధానంగ నేపాల్లో విద్యలు నేర్చుకున్న లేడీ అద్భుతమైన పైట్స్ తో అలరించింది.
 
మంచు మనోజ్ చాలా కాలం తర్వాత సరైన పాత్ర చేశాడని చెప్పవచ్చు.  చాలా ఛాలెంజింగ్ గా కూడా చేశారు. కొన్ని ఇబ్బందికర సన్నివేశాలని సైతం మనోజ్ చేయడం తన గట్స్ ని మరోసారి ప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా తనపై శబ్ద గ్రంధం యాక్షన్ ఎపిసోడ్స్ వాటిని తనలోకి ఆవహించుకోవడం వంటివి హాలీవుడ్ స్థాయిలో ఇదివరకు చూసేవాాళ్ళం. ఇందులో డీవియేషణ్ లేకుండా చక్కగా చూపించాడు.
 
శ్రియా శరన్ సాధువుగా అంబిక పాత్రలో శ్రియ బాగా చేశారు. అలాగే నటుడు జైరాం అశ్వథ్థామగా  మంచి పాత్రలో కనిపించి మెప్పించారు. వేద జన్మ రహస్యాన్ని తెలియజేసే సాధువుగా రితికా సింగ్, మొదటి గ్రంథాన్ని రక్షించే రక్షకుడిగా జగపతిబాబు ముఖ్య సన్నివేశాల్లో బాగా చేశారు. వేదతోపాటు ట్రావెల్ అయ్యే గెటప్ శ్రీను పాత్ర తీరును బాగా డిజైన్ చేశారు.
 
అయితే సీరియస్ గా సాగే ఈ కథకు పాటలు బ్రేక్ అనిపించే ఒక్క పాట పెట్టలేదు. కార్తికేయ 2 వంటి సీరియస్ కథ, పరిశోధనతో సినిమా సాగుతుంది. ఫైటర్లు నేపాలీ గెటప్ తో చేయడం సినిమాకు జాతీయస్థాయి తెచ్చిందనే చెప్పాలి. ఆ క్రమంలో అడ్వెంచరస్ డ్రామాలో పలు ఎపిసోడ్స్ ఇది వరకే మనం చూసిన ఈ తరహా సినిమాలని కూడా గుర్తు చేయక మానవు. అయినా దానిని మర్చిపోయేలా దర్శకుడు తర్వాత సన్నివేశాల్లో చూపించాడు. ట్రైయిన్ ఎపిసోడ్, పోలీసులు వేదను వేటాడే క్రమం ఆటవిడుపుగానూ, వర్తమానంలో కథ జరుగుంటే పోలీసులు పట్టించుకోరా అనే విమర్శకు తావులేకుండా చేశాడు. క్లైమాక్స్ ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఎండ్ చేసి ఉంటే బాగుండేది. షడెన్ గా ముగించినట్లుంది. 
 
ముఖ్యంగా, నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్ లోనే గ్రాఫిక్స్ తో బాగా చేయొచ్చు అని చూపించడానికి మిరాయ్ ని మరో చక్కటి ఉదాహరణ. సినిమాలో యాక్షన్ పార్ట్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనితీరు గాని సాలిడ్ గా ఉన్నాయి. ఈ రేంజ్ అవుట్ ఫుట్ ని అయితే చాలామంది ఊహించి కూడా ఉండకపోవచ్చు. హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరి ఈ సినిమాకి ప్లస్ అయి చెప్పాలి. నేపథ్య సంగీతంతో మరింత పవర్ఫుల్ గా ఎలివేట్ చేశారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కూడా కెమెరామెన్ కావడంతో తననుకుందని చక్కగా చేయించుకోగలిగాడు. చిన్నపాటి లోపాలున్నా తెలుగులో ఈ మాత్రం సినిమా చేశాడంటే నిర్మాతను అభినందించాల్సిందే. అంతకు ముందు తాను తీసిన సినిమాలతో నష్టాలు చవిచూసినా ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతానని నమ్మకంతో విశ్వప్రసాద్ చెప్పిన మాట వమ్ముకాలేదు అనిపిస్తుంది.
 
ఇప్పటి జనరేషన్ ను ఏమాత్రం నిరాశపరచకుండా మిరాయ్ వుంది. ముఖ్యంగా తేజ సజ్జ, మనోజ్ లు తమ రోల్స్ లో మైమరిపించారు. అలాగే దర్శకుడు విజన్ తన ప్రయత్నంకి మరిన్ని మార్కులు ఇవ్వొచ్చు. దానికి సీక్వెల్ గా మిరాయ్ 2 వచ్చేలా దగ్గుబాటి రానా ను చూపించి తంత్రశక్తులతో అంతా బంగారం చేసే వాడిగా కనిపించి ట్విస్ట్ ఇచ్చాడు.
రేటింగ్: 3.25/5