1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 మే 2025 (17:27 IST)

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

terrorist funeral
ఉగ్రవాదాన్ని తాము పెంచి పోషించడం లేదంటూ ప్రపంచ దేశాలను బురిడీ కొట్టిస్తూ వచ్చిన పాకిస్థాన్ నిజస్వరూపం ఇపుడు బయటపడింది. భారత్ జరిగిన మెరుపు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒకప్పుడు తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినప్పటికీ.. ప్రస్తుతం తమ దేశంలో ఉగ్రవాదులు లేరని బుకాయిస్తోంది. ఈ నేపథ్యంలో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి (Vikram Doraiswami) ప్రపంచం ముందుకు కీలక ఆధారాలు తీసుకువచ్చారు.
 
ఇటీవల పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడుల్లో మరణించిన జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజహర్, ఇతర ఉగ్రవాదుల అంత్యక్రియలకు అక్కడి సైన్యం, ప్రభుత్వ అధికారులు హాజరై, నివాళులు అర్పిస్తున్న ఫొటోను జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అందులో ఉగ్రవాదుల శవపేటికలపై పాకిస్థాన్ జెండాలు కప్పి ఉన్నాయి. దీని ద్వారా ఉగ్రవాదుల వెనుక ఎవరున్నారనే విషయం ప్రపంచ దేశాలకు తెలుస్తోందని విక్రమ్ దొరైస్వామి పేర్కొన్నారు. ఇందుకు ఇంతకంటే సరైన ఆధారం మరొకటి ఉండదని అన్నారు.
 
రవూఫ్ అజహర్ పలు ఉగ్రదాడుల్లో నిందితుడు. 1999లో జరిగిన ఐసీ814 విమాన హైజాక్లో కూడా రవూఫ్ అజహర్ హస్తం ఉంది. ఐదుగురు పాక్ ఉగ్రవాదులు నేపాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు చేర్చారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి.. భారత జైళ్లలో ఉన్న మసూద్ అజహర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ గర్ అనే ఉగ్రవాదులను విడిపించుకొని తీసుకెళ్లారు. ఆ తర్వాతే మసూద్ అజహర్ జైషే జర్గర్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఇక 2001లో జరిగిన పార్లమెంట్‌పై దాడి, 2016లో పఠాన్‌కోట్ దాడి, 2019లో పుల్వామా బాంబింగ్ వంటి ఉగ్ర ఘటనల్లో రవూఫ్ ప్రమేయం ఉంది. ప్రస్తుతం జైషే మొహమ్మద్ కీలక కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు.