శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2024 (09:30 IST)

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

donald trump
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట లభించింది. గత 2020 నాటి ఎన్నిక కేసును కొట్టివేస్తూ అమెరికా న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. 
 
అమెరికా తదుపరి అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో 2020లో నమోదైన ఎన్నికల కేసును కొట్టివేయాలంటూ ఆయన తరపు న్యాయవాది జాక్ స్మిత్ కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి తాన్యా చుట్కాన్ అంగీకరించారు. 'కేసును తొలగించడం సముచితం. ఈ తీర్పు అధ్యక్షుడు పదవిలో ఉన్నంతవరకు మాత్రమే. బాధ్యతల నుంచి వైదొలిగిన వెంటనే తీర్పు గడువు ముగుస్తుంది' అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
 
2020 ఎన్నికల నాటి కేసు కొట్టివేయడంపై ట్రంప్ స్పందించారు. 'ఈ కేసులు చట్టవిరుద్ధమైనవి. మాపై పోరాడేందుకు మా ప్రత్యర్థులైన డెమోక్రట్లు పన్ను చెల్లింపుదారులకు చెందిన 100 మిలియన్ డాలర్లు వృథా చేశారు. ఇంతకుముందు మన దేశంలో ఇటువంటివి జరగలేదు' అని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.
 
2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో దిగిన ట్రంప్ పారాజయం పాలైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నప్పుడు వైట్ హౌస్ నుంచి పలు కీలక దస్త్రాలు తరలించారని ఆరోపిస్తూ కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులు ఎప్పుడూ విచారణకు రాకపోవడం గమనార్హం. అమెరికాలో న్యాయశాఖ నిబంధనల ప్రకారం.. సిట్టింగ్ అధ్యక్షుడు క్రిమినల్ విచారణను ఎదుర్కోకుండా వారికి రక్షణ ఉంటుంది. 
 
ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో మరికొన్ని రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో గతంలో ఆయనపై నమోదైన పలు కేసుల్లో ఊరట లభిస్తుంది. ఇటీవల హష్ మనీ కేసులో ట్రంప్‌నకు శిక్ష ఖారారయినప్పటికీ.. ఆ శిక్షను నిరవధికంగా వాయిదా వేస్తూ న్యూయార్క్ జడ్జి తీర్పునిచ్చారు.