లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో పోలీసులు, ఉగ్రవాద సంబంధాలు ఉన్న వ్యక్తులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఒక టెర్రర్ మాడ్యూల్తో వీరికి లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు వ్యక్తులకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఆపరేషన్‌లో పోలీసులు కీలక సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చైనా తయారీకి చెందిన రెండు గ్రనేడ్లు వారి నుంచి లభించాయి. సరిహద్దుల మీదుగా ఐదు అధునాతన తుపాకులు, వాటికి సంబంధించిన లైవ్ బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను బట్టి, వీరు పెద్ద కుట్రకు ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
ఎన్కౌంటర్లో గాయపడిన ఈ ఇద్దరు వ్యక్తులకు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఒక ఉగ్రవాద ముఠాతో సంబంధం ఉంది. ఈ ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెల్సిందే. వారిని విచారిస్తుండగా.. ఈ వ్యక్తుల గురించి సమాచారం లభించిందని తెలుస్తోంది. పక్కా సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారు ప్రతిఘటించి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది.