గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2024 (16:14 IST)

దోపిడీ పెళ్లి కుమార్తె : సెటిల్మెంట్ల రూపంలో రూ.1.25 కోట్లు వసూలు!

child marriage
దోపిడీ పెళ్లి కుమార్తెకు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ పోలీసులు చెక్ పెట్టారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో చూసి విడాకులు తీసుకున్న వారు, భార్యలు మరణించిన వారికీ గేలం వేసి ఏకంగా రూ.1.25 కోట్ల మేరకు సెటిల్మెంట్ల రూపంలో వసూలు చేసింది. కేవలం రాజస్థాన్ రాష్ట్రంలోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ దోపిడీ పెళ్లి కుమార్తె చేతిలో మోసపోయిన వారు కూడా ఉన్నట్టు సమాచారం. దీనిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరాఖండ్‌కు చెందిన సీమా అలియాస్ నిక్కి అనే మహిళ 2013లో తొలుత ఆగ్రాకు చెందిన వ్యాపారిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు భర్త కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. ఆ తర్వాత సెటిల్మెంట్ పేరుతో రాజీకి వచ్చి రూ.75 లక్షలు వసూలు చేసుకుని తర్వాత కేసును ఉపసంహరించుకుంది. 
 
ఆ తర్వాత 2017లో సీమా గురుగ్రామ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఈ క్రమంలో రూ.10 లక్షలు దండుకుంది. అనంతరం గతేడాది జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. అనంతరం రూ.36 లక్షల విలువైన నగలు, నగదుతో ఉదాయించింది. ఆ కుటుంబం కేసు పెట్టడంతో నిందితురాలు సీమాను తాజాగా జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
 
నిందితురాలు మ్యాట్రిమోనియల్ సైట్లలో చూసి భార్యలను కోల్పోయిన వారు, విడాకులు అయిన వారిని ఎంచుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. అలా వివిధ రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకుని ఇప్పటివరకు రూ.1.25 కోట్లను సెటిల్మెంట్ల రూపంలో వసూలు చేసినట్టు పేర్కొన్నారు.