సోమవారం, 8 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (23:31 IST)

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Ranya Rao
Ranya Rao
కన్నడ నటి రన్యారావుకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) బిగ్‌షాక్‌ ఇచ్చింది. ఈ హై ప్రొఫైల్ బంగారు అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావుతోపాటు మరో ముగ్గురికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. 
 
గోల్డ్‌ స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు ఏకంగా రూ.102.55 కోట్ల జరిమానా విధించింది. 127.3 కిలోల అక్రమ రవాణా బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కన్నడ పోలీసులు మార్చి 3న నటి రన్యను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 
 
అప్పటి నుంచి కేసు విచారణలో ఉండగా ఈ రోజు డీఆర్‌ఐ తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా రన్యాకు ఏకంగా రూ.102.55 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ బకాయిలు చెల్లించకపోతే నిందితుల ఆస్తులను జప్తు చేస్తామని అధికారులు హెచ్చరించారు. 
 
ఈ కేసులో 72.6 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు తరుణ్ కొండూరు రాజును దోషిగా తేల్చడంతో రూ.62 కోట్ల జరిమానాను విధించింది. ఇక 63.61 కిలోల గోల్డ్‌ అక్రమ రవాణాకు బాధ్యులుగా తేలిన సాహిల్ జైన్, భరత్ జైన్ ఇద్దరికీ రూ.53 కోట్లు చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
 
డీఆర్‌ఐ తన షో-కాజ్ నోటీసులకు 2,500 పేజీలకు పైగా పత్రాలను అందించి, కస్టమ్స్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద చర్యలను ప్రారంభించింది. త్వరలోనే ప్రాసిక్యూషన్ చేపడతామని అధికారులు సూచించారు.
 
ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించిన COFEPOSA (విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం) పిటిషన్‌ను హైకోర్టులో మంగళవారం విచారించి సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. రికవరీని నిర్ధారించడానికి దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు డీఆర్ఐ తెలిపింది.