గురువారం, 4 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 డిశెంబరు 2025 (14:37 IST)

ఢిల్లీ వాయుకాలుష్యంతో చిన్నారులు చనిపోతున్నారు ... సోనియా ఆందోళన

delhi pollution
ఢిల్లీ వాయు కాలుష్యంతో అనేకమంది చిన్నారులు చనిపోతున్నారని కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నానాటికీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఢిల్లీలో వాయు కాలుష్యంపై గురువారం ప్రతిపక్షాలు పార్లమెంటు ఆవరణలో నిరసనలు తెలిపాయి. మాస్కులు ధరించి ప్రధాని ప్రకటనలు చేయడం ఆపి.. చర్యలు చేపట్టడంపై దృష్టిపెట్టాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమస్యపై పార్లమెంటులో చర్చ జరగాలని డిమాండ్‌ చేస్తూ.. నినాదాలు చేశారు. 
 
ఇందులో సోనియాగాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. అనంతరం సోనియా విలేకరులతో మాట్లాడుతూ.. వాయు కాలుష్యంతో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వృద్ధులు అవస్థలు పడుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. 
 
ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని.. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు. ‘ఎలాంటి వాతావరణాన్ని ఆస్వాదించాలి. బయట కాలుష్య పరిస్థితులు చూడండి. సోనియాగాంధీ చెప్పినట్లు పిల్లలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. అనేకమంది వృద్ధులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నారు. ఏటా ఈ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రకటనలు చేయడం తప్ప, చర్యలు తీసుకోదు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇది రాజకీయ సమస్య కాదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’ అని అన్నారు.
 
కాగా, పార్లమెంటులో శీతాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో.. వాయుకాలుష్యంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్‌ ఎంపీలు కొందరు నోటీసులు జారీ చేశారు. ఇందులో పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ మాట్లాడుతూ.. వాయు కాలుష్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా సలహాలు ఇస్తోందని మండిపడ్డారు. కాలుష్యం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు గుప్పించారు.