శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (13:48 IST)

అభీష్టానికి తగినట్టుగా న్యాయమూర్తుల ఎంపిక మంచి పరిణామం కాదు : సుప్రీంకోర్టు ఆక్షేపణ

supreme court
దేశంలోని హైకోర్టులకు న్యాయమూర్తుల ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల జాబితా నుంచి అభీష్టానికి తగినట్టుగా ఎంపిక విధానం (చూజ్ అండ్ పిక్) అనుసరించడం మంచి పరిణామం కాదని స్పష్టం చేసింది. బదిలీ కోసం 11 మంది జడ్జీల పేర్లను కొలీజియం సిఫార్సు చేయగా.. అందులో ఐదుగురే బదిలీ అయ్యారని వివరించింది. ఆరు పేర్లు ఇంకా కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయని తెలిపింది. 
 
'ఇది మంచి పరిణామం కాదని గతంలోనూ మీకు చెప్పా. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సంకేతాన్ని పంపుతోంది' అని కొలీజియం సభ్యుడైన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హైకోర్టుల్లో జడ్జీలుగా నియమించడం కోసం ఇటీవల చేసిన సిఫార్సుల్లో 8 పేర్లు ఇంకా పెండింగులో ఉన్నాయని కూడా ధర్మాసనం గుర్తుచేసింది. వారిలో కొందరు.. ఇప్పటికే నియమితులైనవారి కన్నా సీనియర్లని గుర్తుచేసింది. 
 
న్యాయమూర్తుల ఎంపిక, బదిలీ కోసం కొలీజియం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలపడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ దాఖలైన రెండు పిటిషన్లపై సోమవారం జస్టిస్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఇలా ఎంపిక చేసిన రీతిలో నియామకాలు చేపట్టడం వల్ల న్యాయమూర్తులు సీనియార్టీని కోల్పోతారని అభిప్రాయపడింది. 'జడ్జీలుగా నియమితులు కావడానికి ఎవరైనా ఎందుకు అంగీకరిస్తారు? ఇదే విషయంపై మేం గతంలోనూ కొన్ని వ్యాఖ్యలు చేశాం. న్యాయమూర్తిగా తనను ఏ సీనియార్టీలో ఉంచుతారన్నది ఒక అభ్యర్థికి తెలియాలి. లేదంటే అర్హులైన అభ్యర్థులను ఒప్పించడం కష్టమవుతుంది' అని ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణనను వచ్చే నెల ఐదో తేదీకి వాయిదా వేసింది.