జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి
జార్ఖండ్‌లో ఘోరం జరిగింది. భార్య తాగి వచ్చిందని ఆమె భర్త నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని పలాము జిల్లా రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాతమ్ బడి ఝరియాలో ఉపేంద్ర పరియా(25), శిల్పి దేవి (22)లు నివసిస్తున్నారు.
ఉపేంద్ర అప్పటికే సోమవారం రాత్రి మద్యం సేవించాడు. అదే సమయంలో అతని భార్య శిల్పిదేవి కూడా మద్యం సేవించి ఇంటికి తిరిగి వచ్చింది. భార్య మద్యం సేవించి రావడం సరికాదని ఆవేశంలో ఊగిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది.
వాగ్వాదం మరింత తీవ్రం కావడంతో ఉపేంద్ర ఆవేశంతో శిల్పిని కొట్టడం ప్రారంభించాడు. అనంతరం ఒక్కసారిగా ఆమెను పైకి ఎత్తివేసి, నేలపై బలంగా విసిరి కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన శిల్పి దేవి అక్కడికక్కడే మరణించింది. నిందితుడైన భర్త ఉపేంద్ర పరియాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప వుంది.