గురువారం, 2 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (11:41 IST)

శశికళకు బినామీ తెలుగు పారిశ్రామికవేత్త జీఆర్కే రెడ్డినా?

sasikala
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు బినామీగా తెలుగు పారిశ్రామికవేత్త, మార్గ్ గ్రూపు అధినేత జీఆర్కే రెడ్డి (జి.రామకృష్ణారెడ్డి) ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు (ఈడీ) జీఆర్కే రెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, గృహాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కెనరా బ్యాంకును రూ.200 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన మనీలాండరింగ్ కేసులో శశికళకు బినామీగా జీఆర్కే రెడ్డి ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, తిరుపతి, చెన్నై నగరాల్లోని జీఆర్కే రెడ్డి నివాసాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. 
 
హైదరాబాద్ నగరంలోని శామీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో ఉన్న జీఆర్కే రెడ్డి నివాసాలు, ఆఫీసుల్లో బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. అదేసమయంలో చెన్నైలోని సైదాపేట, తిరువాన్మియూరు, కోడంబాక్కం సహా మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ తనిఖీల సందర్భంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, జీఆర్కే రెడ్డి, ఆయన కంపెనీల పేర్ల మీద ఉన్న ఆస్తుల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుట్లు సమాచారం.
 
సీబీఐ 2022లో నమోదు చేసిన ఈ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. శశికళ బ్యాంకు నుంచి రుణాలు పొంది, ఆ నిధులను జీఆర్కే రెడ్డికి చెందిన సంస్థలకు మళ్లించారని, ఆ డబ్బుతో ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారని బలమైన ఆరోపణలు ఉన్నాయి. 
 
గతంలో జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఆమె తరఫున హైదరాబాద్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని, ఆమె మరణానంతరం శశికళకు బినామీగా వ్యవహరిస్తున్నారనే సమాచారంతోనే ఈడీ ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. మిడ్వెస్ట్ గోల్డ్, మెడ్స్ వంటి సంస్థల్లో జీఆర్కే రెడ్డికి ఉన్న రూ.2,800 కోట్ల విలువైన షేర్ల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.