బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (22:12 IST)

మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం (Video)

Ambanis take the Holy Dip at Maha Kumbh
ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ తన తల్లి, కుమారులు, మనుమలు/మనుమరాళ్లతో కలిసి పవిత్ర స్నానం చేశారు. ముకేశ్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, కుమారులు ఆకాశ్, ఆనంత్, కోడళ్ళు శ్లోకా, రాధికా, మనుమలు పృథ్వి, వేద, అక్కలు దీప్తి సల్గావ్కర్, నీనా కోఠారి తదితరులతో కలిసి స్నానం చేశారు. వీరితో పాటు ముకేశ్ అంబానీ అత్త పూర్ణిమాబెన్ దలాల్, మరదలు మమతాబెన్ దలాల్ కూడా పాల్గొన్నారు.
 
Ambanis take the Holy Dip at Maha Kumbh
గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమం వద్ద అనేకమంది యాత్రికులతో కలిసి అంబానీ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రలో భాగమైంది. నిరంజని అఖాడాకు చెందిన స్వామి కైలాషానంద గిరిజీ మహారాజ్ గంగా పూజను నిర్వహించారు. పూజ అనంతరం ముకేశ్ అంబానీ పరమార్థ్ నికేతన్ ఆశ్రమానికి చెందిన స్వామి చిదానంద సరస్వతీ మహారాజ్‌ను కలుసుకున్నారు. ఆశ్రమంలో అంబానీ కుటుంబం ప్రసాదం, లైఫ్ జాకెట్లను పంపిణీ చేసింది.
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మహా కుంభమేళాలో యాత్రికుల సేవ కోసం ‘తీర్థ యాత్రి సేవ’ పేరిట వివిధ సేవలను అందిస్తోంది. ఈ యాత్రలో యాత్రికుల సంక్షేమం, సౌకర్యాలను మెరుగుపరచడానికి కంపెనీ ఈ ప్రత్యేక సేవలను చేపడుతోంది. ‘వీ కేర్’ తత్వాన్ని ఆధారంగా తీసుకుని రిలయన్స్ యాత్రికులకు పౌష్టికమైన భోజనం (అన్న సేవ), పూర్తి వైద్యం, భద్రతా రవాణా, మెరుగైన కనెక్టివిటీ వంటి అనేక సేవలను అందిస్తోంది. అంతేకాకుండా పవిత్ర నదీ జలాల్లో భద్రత, సౌకర్యవంతమైన విశ్రాంతి కేంద్రాలు, స్పష్టమైన మార్గదర్శక వ్యవస్థ, పరిపాలన, పోలీస్, మరియు లైఫ్ గార్డులకు మద్దతు వంటి ఇతర సేవలు కూడా అందిస్తోంది.